● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి, పత్తి దిగుబడి ● కొనుగోళ్ల సమయంలో తప్పని తిప్పలు ● నష్టాలు మిగిల్చిన 2025 | - | Sakshi
Sakshi News home page

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి, పత్తి దిగుబడి ● కొనుగోళ్ల సమయంలో తప్పని తిప్పలు ● నష్టాలు మిగిల్చిన 2025

Dec 28 2025 7:32 AM | Updated on Dec 28 2025 7:32 AM

● ఈ ఏ

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి, పత్తి దిగుబడి ● కొనుగోళ్ల సమయంలో తప్పని తిప్పలు ● నష్టాలు మిగిల్చిన 2025

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మెకర్తి గోపాల్‌. ఆసిఫాబాద్‌ మండలంలోని బూర్గుడలో గతేడాది 13 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా 170 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా 13 ఎకరాల్లో పత్తి సాగు చేయగా అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో 46 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఇతనొక్కడే కాదు జిల్లాలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు’

జిల్లా కేంద్రానికి చెందిన హరందరె నాందేవ్‌ ఈ ఏడాది 18 ఎకరాల్లో పత్తి, మూడెకరాల్లో కంది సాగు చేశాడు. పెట్టుబడికి సుమారు రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. గతేడాది 200 క్వింటాళ్ల పత్తి, 18 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కేవలం 65 క్వింటాళ్ల పత్తి మాత్ర మే రావడంతో తీవ్రంగా నష్టపోయాడు. వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఆసిఫాబాద్‌: జిల్లా అత్యధిక శాతం మంది ప్రజలు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతినడంతో వ్యవసాయం పండగలా కాకుండా దండగలా మారింది. పత్తికి మద్దతు ధర లభిస్తుండడంతో ఏటా రైతులు పత్తినే అధికంగా సాగు చేస్తున్నారు. గతేడాది జిల్లాలో 4.34 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 3.42 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది వానాకాలం 4.52 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47,228 ఎకరాల్లో వరి, 3,017 ఎకరాల్లో జొన్న, 7,668 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు కాస్తా పెరిగింది. గతేడాది జిల్లాలో 1800 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ ఏడాది సుమారు 1200 ఎకరాల్లో సాగు చేశారు. వీటితో పాటు రెబ్బెన, వాంకిడి, కెరమెరి, కౌటాల, ఈజ్‌గాం, తదితర మండలాల్లో కూరగాయలు సైతం సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నూనె గింజల సాగు కాస్తా పెరిగింది. గతేడాది వానాకాలంలో జిల్లాలో 387 ఎకరాల్లో నూనె గింజల సాగు చేయగా, ఈ ఏడాది 1,332 ఎకరాల్లో సాగైంది. గతేడాది 3,691 ఎకరాల్లో పప్పు ధాన్యాలు సాగు చేయగా ఈ ఏడాది 21,054 ఎకరాల్లో సాగైంది. గోధుమ పంటపై రైతులు ఆసక్తి చూపడం లేదు. కూరగాయలు గతేడాది 941 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 785 ఎకరాల్లో సాగైంది. రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఏటా ఒకే రకం పంటలు సాగు చేస్తున్నారు. కొత్త పంటల వైపు మొగ్గు చూపడం లేదు.

చతికిలపడ్డ పత్తి రైతులు

జిల్లాలో ఈ ఏడాది 3.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 35 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. కానీ కురిసిన అధిక వర్షాలకు పత్తిచేలన్నీ నీట మునగడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. గతేడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు సీసీఐ, ప్రైవేటులో జిల్లాలో 9,40,248 క్వింటాళ్ల కొనుగోళ్లు జరగగా ఈ ఏడాది 6,79,295 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, వర్షం ప్రభావంతో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లకు పడిపోయింది. సెప్టెంబర్‌లో కురిసిన ఎడతెరపిలేని వర్షాలకు వ్యవసాయ శాఖ సర్వే ప్రకారం 6,704 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. అప్పుల బాధ, ఇతర కారణాలతో జిల్లాలో 8 మంది రైతులు ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అలంకారప్రాయంగా ప్రాజెక్టులు

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంటలకు నీరందకపోవడంతో అలంకార ప్రాయంగా మారాయి. కుమురంభీం కుడి, ఎడమ కాల్వల ద్వారా 37,500 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉండగా అసంపూర్తి కాల్వల నిర్మాణంతో పది శాతం ఆయకట్టుకు కూడా అందని పరిస్థితి నెలకొంది. వట్టివాగు జలాశయంలో సింగరేణి ఓపెన్‌కాస్టు మట్టి చేరడంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఎన్టీఆర్‌ సాగర్‌, అమ్మన మడుగు ప్రాజెక్టుల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. బడ్జెట్‌లో కాల్వల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో రైతులకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.

ప్రైవేటు వైపే మొగ్గు

జిల్లాలో 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 48 వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 4,550 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. రైతులకు రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 3.64 కోట్లు చెల్లించారు. గ్రేడ్‌–1 రకం వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,369 ఉండగా, ప్రైవేటులో రూ.2,300 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తుండగా కేవలం ఖరీఫ్‌కు మాత్రమే పరి మితమైంది. యాసంగి వడ్లకు బోనస్‌ చెల్లించలేదు. ఈ క్రమంలో రైతులు ప్రైవేటుకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మిర్చి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఖమ్మం, వరంగల్‌, మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌, తదితర ప్రాంతాల్లో విక్రయించాల్సి వస్తుంది. దీంతో మిర్చి సాగుకు రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు.

యూరియా కష్టాలు

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసినా యూరియా కొరత రైతులను ఇక్కట్లకు గురిచేసింది. తెల్లవారుజామునుంచే దుకాణాల ఎదుట గంటల కొద్దీ క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితులు దాపురించాయి. సకాలంలో యూరియా సరఫరా చేయాలని జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో రైతులు ఆందోళనలు సైతం చేపట్టారు.

కపాస్‌ కిసాన్‌ యాప్‌

ఈ ఏడాది ప్రభుత్వం కపాస్‌ కిసాన్‌ యాప్‌ ప్రవేశ పెట్టింది. పత్తి విక్రయించే రైతులు తప్పనిసరిగా ఈ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేయాల్సి రావడంతో కౌలు రైతులు ఇబ్బందులకు గురయ్యారు. యాప్‌ రద్దు చేయాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేపట్టారు.

పెరిగిన కూలి రేట్లు

పత్తి రైతులకు పెరిగిన కూలి రేట్లు మూలిగేనక్కపై తాటికాయ పడినట్లయింది. దిగిబడి తగ్గినప్పటికీ పత్తి ఏరివేత కూలీ రేట్లు పెంచడం రైతులకు అదనపు భారంగా మారింది. పత్తి ఏరివేతకు కిలోకు రూ.10 నుంచి రూ.12కు పెంచారు. దీంతో పాటు కూలీలను ఆటోల్లో తీసుకురావాల్సి రావడంతో రవాణా ఖర్చులు కూడా రైతులు భరించాల్సి వచ్చింది.

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి1
1/5

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి2
2/5

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి3
3/5

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి4
4/5

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి5
5/5

● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement