ఆ‘పరేషన్‌’ భారం! | - | Sakshi
Sakshi News home page

ఆ‘పరేషన్‌’ భారం!

Dec 28 2025 7:32 AM | Updated on Dec 28 2025 7:32 AM

ఆ‘పరేషన్‌’ భారం!

ఆ‘పరేషన్‌’ భారం!

● ఐదేళ్లుగా నిలిచిన కు.ని శస్త్ర చికిత్సలు ● ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వైనం ● పేదలపై ఆర్థికభారం

కెరమెరి(ఆసిఫాబాద్‌): జనాభాను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను ప్రోత్సహిస్తూ వచ్చేది. సర్కారు దవాఖానా ల్లో క్రమం తప్పకుండా ఆపరేషన్లు చేసేవారు. కానీ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐదేళ్లుగా కు.ని ఆపరేషన్లు నిలిచిపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుండడంతో ఆర్థికభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జి ల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లో మినహా ఇతర మండలాల్లో కు.ని శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులు లేకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ప్రైవేటు ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలోని 15 మండలాల్లో ఈ ఏడాది సుమారు 4 వేల మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నారు.

ఆర్థిక భారం..

ప్రభుత్వ ఆస్పత్రులో 2020 ఏప్రిల్‌ నుంచి కు.ని శిబిరాలు నిర్వహించడం లేదు. దీంతో చేసేదేంలేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. కొందరు కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌తో పాటు మరి కొందరు ఆదిలాబాద్‌, మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. ఇందుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని బాధితులు పేర్కొంటున్నా రు. కొన్ని సందర్భాల్లో స్థాయిని బట్టి ఇంకా ఎక్కువగా కూడా వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కు.ని ఆపరేషన్ల కోసం మండలాల వారీగా తేదీలను ప్రకటించి మరీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించేవారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న పీహెచ్‌సీల్లో కేవలం డెలివరీలు మాత్రమే చేస్తూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

పక్క రాష్ట్రాలకు..

జిల్లాలోని కెరమెరి, జైనూర్‌, నార్నూర్‌, వాంకిడి, సిర్పూర్‌(టి) తదితర మండలాలకు మహారాష్ట్ర ప్రాంతం సరిహద్దున ఉంటుంది. చంద్రాపూర్‌, రా జుర, జివితి, గడ్చందూర్‌, గడ్చిరోలి, తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లి కు.ని ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు.

ముందుకురాని గైనకాలజిస్టులు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు గైనకాలజిస్టులు ముందుకురావాలి. కానీ వెనుకబడిన జిల్లా కావడంతో కుమురంభీం జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పట్టణాల్లో ఉండేందుకు అలవాటు పడిన వారు మారుమూల మండలాలకు వచ్చేందుకు ఇష్టత చూపడం లేదని ఒక అధికారి పేర్కొన్నారు. కాగా గతంలో ఒక్కో కు.ని శస్త్ర చికిత్స చేస్తే ప్రభుత్వం రూ.వెయ్యి ఇచ్చేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గైనాకాలజిస్టులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు చెల్లించక పోవడంతో కూడా ఇక్కడికి రావడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రోత్సాహకాలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కు.ని శస్త్రచికిత్స చేయించుకున్న వారికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసింది. ఎస్టీ, ఎస్టీ మహిళలు రూ.880, ఇతరులకు రూ.660 అందించేవారు. ఈ మొత్తం రవాణా ఖర్చులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుకు ఉపయోగపడేవి. ప్రస్తుతం ఆపరేషన్లు లేకపోవడంతో ప్రోత్సాహకాలు కూడా నిలిచి పోయాయి. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయితే రెండు రోజులు బాలింతతో పాటు అటెండర్‌కు రోజుకు రెండు పూటలా భోజనం అందించేవారు. కానీ ఇప్పుడు నిధుల కొరతతో భోజనం పెట్టడం మానేశారు. దీంతో డెలివరీకి వచ్చే మహిళలు ఇంటినుంచి టిఫిన్‌ బాక్సులు తెచ్చుకుంటున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు

పీహెచ్‌సీలు 20

సీహెచ్‌సీలు 05

ఏరియా ఆస్పత్రులు 01

జనరల్‌ ఆస్పత్రి 01

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement