నూతన కార్మిక చట్టాలు ఉపసంహరించుకోవాలి
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూపాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేఖ విధానాలకు నిరసనగా శుక్రవారం కాగజ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కార్మికులను కట్టుబానిసలుగా చేసే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమం మాదిరిగా కార్మికులు ఐక్యంగా కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేస్తూ.. జీ రాంజీ చట్టం పేరుతో తన వాటా నిధులను 60 శాతానికి కుదించిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, జిల్లా సహాయక కార్యదర్శి వెలిశాల కృష్ణామాచారి, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకానంద్, కార్తీక్, వివిధ సంఘాల నాయకులు కూశన రాజన్న, ముంజం శ్రీనివాస్, ఆనంద్‌కుమార్, దినకర్, మంజూల, అనిత, పద్మ, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


