వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని జీఎం(ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు) జి.దేవేందర్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో శుక్రవారం పర్యటించారు. ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డితో కలిసి ఖైరిగూర ఓసీపీని సందర్శించారు. ఈ సందర్భంగా ఓసీపీ వ్యూ పాయింట్ నుంచి పనిస్థలాలను పరిశీలించారు. ఉత్పత్తి సాధన, రవాణాకు రానున్న మూడు నెలలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఆయన తెలుసుకున్నారు. గోలేటి ఓసీపీ పనుల ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఖైరిగూర ఓసీపీ ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


