గాంధీ పేరు కొనసాగించే వరకు ఉద్యమం
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధిహామీ పథకానికి తిరిగి మహాత్మా గాంధీ పేరు కొనసాగించేవరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. పథకం నుంచి గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ చౌక్ వరకు చేరుకుని రాస్తారోకో చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ గాంధీ కుటుంబం పేరు పలి కితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించే పథకాన్ని నిర్వీర్యం చేయడమే ఆ పార్టీ ఎజెండా అని ఆరోపించారు. కార్యక్రమంలో యూత్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యాం, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, నాయకులు చరణ్, ముఖిద్, కుసుమ్, సాగర్, నారాయణ, సుధాకర్, తిరుపతి, మంగ, వందన, ఇందిరాబాయి, జక్కన్న, సత్తన్న, మురళి పాల్గొన్నారు.


