తోషం తండాలో ఇల్లు దగ్ధం
గుడిహత్నూర్: మండలంలోని తోషం తండాలో ఆదివారం తెల్లవారు జామున గ్రామానికి చెందిన రాథోడ్ గజానంద్‌కు చెందిన ఇల్లు అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గజానంద్ ఊరి చివరలో నివాసం ఉంటుండగా ప్రమాదం జరిగిన రోజు ఆయన కుటుంబ సభ్యులతో తన అత్తవారి ఇంట్లో నిద్ర పోయాడు. రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరగ్గా గ్రామస్తులు వెంటనే మంట లు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక దళానికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు లేక పోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సరుకులు, వస్తువులు మొత్తంగా రూ.80వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. కాగా బాధితుడు గజానంద్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు.


