
పచ్చదనంపై నిర్లక్ష్యం!
కాగజ్‌నగర్‌టౌన్: ప్రభుత్వం ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమం వనమహోత్సవం పెద్దఎత్తున నిర్వహిస్తోంది. జూన్‌లో వర్షాలు కురి సిన తర్వాత మొక్కలు నాటడం ప్రారంభిస్తారు. అయితే కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. బల్దియా కార్యాలయం ఆవరణలో మే నెలలోనే పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్, ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా మొక్కలు నాటా రు. ఆ తర్వాత వర్షాలు కురిసి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వనమహోత్సవం జోరందుకోలేదు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో ఇంటింటికి మున్సిపల్ సిబ్బంది మొక్కలు అందజేస్తారనే ఆశతో ఎదురుచూస్తున్న పట్టణవాసులకు నిరాశే మిగిలింది.
60వేల మొక్కల లక్ష్యం..
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నా యి. ఆయా వార్డుల్లో 60 వేల మొక్కలు నాటాల ని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన మొక్కలను కాగజ్‌నగర్ మండలం వంజీరి గ్రామ సమీపంలో మున్సిపల్ స్థలంలోని నర్సరీలో పెంచుతున్నారు. ఏటా వనమహోత్స వం కార్యక్రమంలో భాగంగా నర్సరీ నుంచి వేల సంఖ్యలో మొక్కలు అవసరం ఉంటాయి. నర్సరీ నుంచి మొక్కలను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలను వినియోగిస్తారు. ఆయా కాలనీల్లోని ప్రజల కు రోడ్ల పక్కన, ఇళ్ల పరిసరాల్లో నాటేందుకు పంపిణీ చేస్తారు. కానీ ఇప్పటివరకు 10 శాతం కూడా పంపిణీ పూర్తికాలేదు. మున్సిపల్ అధికా రులు ఎప్పటివరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
సంరక్షణ చర్యలు కరువు
కాగజ్‌నగర్ బల్దియాకు మొక్కలు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన వంజీరి నర్సరీపై సంబంధిత అధికారుల పట్టింపు కరువైంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో మొక్కలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని కవర్లలో మొక్కలు లేకుండా కింద పడేసి ఉన్నాయి. నర్సరీలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయి దర్శనమిస్తున్నా యి. బొప్పాయి, కర్జూర, అల్లనేరడు, గులాబీ, మందారం చెట్లు నామమాత్రంగా ఉన్నాయి. నర్సరీలోని మొక్కలు పట్టణంలో వనమహోత్సవ కార్యక్రమం లక్ష్యం చేరుకునేందుకు సరిపోవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏర్పాట్లు చేస్తున్నాం
మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో త్వరలోనే వనమహోత్సవం కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పట్టణ ప్రజలకు ఉచితంగా మొక్కలు కూడా అందజేస్తాం. మొక్కల పెంపకం, సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం.
– రాజేందర్,
మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ బల్దియాలో నామమాత్రంగా వనమహోత్సవం
మొక్కల పంపిణీపై దృష్టి సారించని అధికార యంత్రాంగం
అస్తవ్యస్తంగా మున్సిపల్ నర్సరీ నిర్వహణ

పచ్చదనంపై నిర్లక్ష్యం!