విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీలో విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రిటైర్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కనుకుంట్ల రామ్‌చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీకి 30 నుంచి 40 సంవత్సరాలపాటు సేవలందించి విరమణ పొందిన ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆర్టీసీ నుంచి రావాల్సిన మొత్తాలు పెండింగ్‌లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక
ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో రిటైర్ట్ ఉద్యోగుల నూతన కమిటీని రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర సహాయక కార్యదర్శి రాంచందర్, రీజినల్ అధ్యక్షుడు హనుమంత్‌రావు, రీజినల్ ముఖ్య సలహాదారుడు సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిపో అధ్యక్షుడిగా కె.మల్లేశం, కార్యదర్శిగా టి.దివాకర్, ఉపాధ్యక్షులుగా పాషా, ప్రభాకర్‌రావు, లింగయ్య, సహాయ కార్యదర్శులుగా మహబూబ్, మోహన్, భూమన్న, కోశాధికారిగా టీఎం సింగ్, ప్రచార కార్యదర్శిగా ఆరీఫ్‌ను ఎన్నుకొన్నారు.


