హాజరు కావాల్సిందే..!
సమగ్ర శిక్ష ఉద్యోగులకూ ‘ఎఫ్‌ఆర్‌ఎస్’
ఇప్పటికే కేజీబీవీ ఉద్యోగులకు..
ఇటీవల డీపీవో, ఎమ్మార్సీ సిబ్బందికి అమలు
సీఆర్పీల విషయంలో రాని స్పష్టత
కెరమెరి(ఆసిఫాబాద్): ఉపాధ్యాయల మాదిరిగానే ఇక నుంచి డీపీవో(డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీస్), ఎమ్మార్సీ సిబ్బంది కూడా ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) హాజరు వేయాల్సిందే. ఈ నెలలో ఉత్తర్వుల జారీకాగా, సిబ్బంది తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ముఖ గుర్తింపు హాజరుతో సిబ్బంది హాజరు విషయంలో గతంతో పోలిస్తే మరింత పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
సమయపాలన పాటించేలా..
విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావడం లేదు. దీంతో విద్యాశాఖ ముఖ గుర్తింపు హాజరును ప్రవేశపెట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తుండగా సత్ఫలితాలు వస్తున్నాయి. దీంతో సమగ్రశిక్ష ఉద్యోగులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ నెల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ వేస్తున్నారు. జిల్లాలోని డీపీవోతోపాటు 15 ఎమ్మార్సీ కార్యాలయాల్లో 12 మంది సీసీవోలు(కంప్యూటర్ కం ఆపరేటర్), 12 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 12 మంది మెసెంజర్లతోపాటు ఏపీవో, ఎస్‌వో, అటెండర్లు పనిచేస్తున్నా రు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లోని సిబ్బందితో కలిపి సుమారు 532 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాస్థాయిలో విధులు నిర్వర్తిస్తు న్న ఎస్‌వోలు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ తోపాటు పలు పథకాలు అమలు, విద్యారంగానికి సంబంధించిన వివరాల సేకరణ, ఇతర విధులు చేపడుతున్నారు. మండల పరిధిలోని విద్యాసంస్థల సమగ్ర సమాచారాన్ని జిల్లా విద్యాశాఖకు అందించడంలో ఎంఐఎస్ కోర్డినేటర్, సీసీవోలు కీలకపాత్ర పోషిస్తున్నారు. నిత్యం డీఈవో కార్యాలయ సిబ్బందితో ప్రత్యుత్తరాలు జరుపుతుంటారు. ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు డీఈవో కార్యాలయానికి నివేదిస్తున్నారు. అయితే కొన్ని కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించలేదని ఆరోపణలు రావడంతో విద్యాశాఖ అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొందరు చుట్టపు చూపుగా హాజరవుతూ, రిజిస్టర్లలో సంతకాలు పెట్టిపోతున్నారనే అపవాదు ఉంది. ఇంటి నుంచే కొందరు ఆన్‌లైన్ పనులు చేస్తున్నారని రాష్ట్రస్థాయి అధికారులు గుర్తించారు.
ఉదయం, సాయంత్రం హాజరు
డీపీవో స్టాఫ్, ఎమ్మార్సీ సిబ్బందితో పాటు కస్తూరి బా గాంధీ విద్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న వా రందరూ ఉదయం, సాయంత్రం ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో హాజరు వేస్తున్నారు. కేజీబీవీ టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ ఉదయం 9.10 గంటలు, సాయంత్రం 4.15 గంటలకు, కార్యాలయ సిబ్బంది ఉదయం 10.30 చెక్‌ఇన్ కాగా... సాయంత్రం 5.00 చెక్ అవుట్ కావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ కొందరు ఉదయం మాత్రమే హాజరు వేసి సాయంత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు మంగళవారమే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వివరాలను సేకరించడంతో ఇక తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పరిశీలించనున్నట్లు సమాచారం. జనవరి 1 నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
సీఆర్పీలు ఎలా..?
పాఠశాలలు తనిఖీ చేసి మండల విద్యాధికారి, డీఈవో కార్యాలయానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న సీఆర్పీ(క్లస్టర్ రిసోర్స్‌పర్సన్)లకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయడంలో సందిగ్ధం నెలకొంది. చెక్‌ఇన్, చెక్‌అవుట్ ఎలా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. వీరు కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలను సందర్శించి సమాచారం సేకరిస్తారు. దీంతో పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలా.. లేక కాంప్లెక్స్ స్థాయిలో పెట్టాలా? అనేది తేలాల్సి ఉంది. ఏది అమలు చేసినా ఇబ్బందులు పడతామని సీఆర్పీలు చెబుతున్నారు.


