బాధితులకు న్యాయం చేయాలి
ఆసిఫాబాద్/రెబ్బెన: గోలేటి ఓపెన్‌కాస్ట్‌లో భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ముంపునకు గురవుతున్న భూములకు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని బుధవారం ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణకుమారి, అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉపేందర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. రైతుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం బ్రోకర్ల ద్వారా నోటీసులు అందించి, బలవంతంగా సంతకాలు పెట్టిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు సిడాం ధర్ము పటేల్, జిట్టవేణి మహేశ్, రాములు పాల్గొన్నారు.


