వంటింట్లో ‘గ్యాస్’ మంట
● గృహావసరాల సిలిండర్‌పై రూ.50 పెంపు ● జిల్లాలో రూ.922కు చేరిన ధర ● జిల్లా ప్రజలపై రూ.40 లక్షల అదనపు భారం
ఆసిఫాబాద్: వంటగ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం సహాయ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి సోమవారం ప్రకటించారు. ఉజ్వల లబ్ధిదారులపైనా ఈ భారం పడనుంది. ప్రస్తుతం జిల్లాలో గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.872 ఉండగా, పెంచిన ధరతో రూ.922కు చేరనుంది. గతేడాది మార్చి 10న ప్రభుత్వం సిలిండర్‌పై రూ.100 తగ్గించగా, 2023 ఆగస్టులో మరో రూ.200 తగ్గించిన విషయం తెలిసిందే. జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, సుమారు.1.40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 28 వేలు డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేలకు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్ కనెక్షన్లు, 600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. పెంచిన ధరలతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.40 లక్షల భారం పడనుంది. గత వారంలో హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్లపై ప్రభుత్వం రూ.41 తగ్గించింది.
వంటగ్యాస్ ధరలు ఇలా..
గతంలో గ్యాస్ ధరలు ఏళ్లపాటు నిలకడగా ఉండేవి. మూడేళ్లుగా మాత్రం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. 2022 మార్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.875 ఉండేది. 2023 జనవరిలో రూ.976కు పెరిగింది. ఏప్రిల్‌లో మరో రూ.50 పెంచడంతో రూ.1019కు చే రింది. జూన్‌లో మళ్లీ రూ.50 పెంచడంతో రూ. 1072 చేరింది. గత ఆగస్టు వరకు వంటగ్యాస్ ధర రూ.1172 చేరింది. ఈ క్రమంలో పేదలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలోనూ మరో రూ.100 తగ్గించింది. దీంతో ధర రూ.872కు చేరడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సిలిండర్‌పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్ ధర రూ.922కు చేరింది. తాజాగా పెరిగిన ధరలు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సైతం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


