● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరు తూ వీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇస్లాంబిన్‌హసన్ సోమవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలింకో సంస్థ ద్వారా నిర్ధారణ అయిన దివ్యాంగులకు సహాయక పరికరాలు వెంటనే ఇవ్వాలని, రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని, మూడునెలలకు ఒకసారి దివ్యాంగుల కన్వర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజయ్య, శ్రీనివాస్, మొండయ్య, తాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి
వాంకిడి: లే అవుట్ భూముల క్రమబద్ధీకరణ ద్వారా కలిగే ప్రయోజనలపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్–2020లో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఈనెల 31లోగా క్రమబద్ధీకరణకు అవసరమైన రుసుం చెల్లిస్తే 25 శాతం మినహాయింపు ఉంటుందన్నారు. అన్ని పంచాయతీల్లో వందశాతం ఇంటిపన్ను వసూలు అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పీహెచ్‌సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన హెడ్‌నర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నమునా, జెడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


