మిగిలింది వారమే..!
● జిల్లాలో 743 సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు.. ● అదనంగా 344 రోడ్లకు అధికారుల ప్రతిపాదనలు ● మార్చి 31 వరకే గడువు
మండలాల వారీగా నిధులు ఇలా..
బెజ్జూర్(సిర్పూర్): రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత మట్టి రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని రోడ్ల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.31 కోట్లు మంజూరు కాగా, మరో రూ.17 కోట్ల నిధులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నిధులు మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు. మరో వారం మాత్రమే గడువు మిగిలి ఉండగా.. శరవేగంగా పనులు పూర్త య్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.
నిధులు ఇలా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో మట్టిరోడ్లు ఉండటంతో ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది జిల్లాకు 610 రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో దాదాపు 500 రోడ్లు పూర్తయ్యాయి. ప్రస్తుత 2024– 25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 743 సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.31 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా మరో 344 సీసీరోడ్లకు రూ.17 కోట్ల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మారుమూల గ్రామాల మట్టి రోడ్లకు మహర్దశ పట్టనుంది.
31లోగా పూర్తి చేస్తాం
జిల్లాలోని 15 మండలాల్లో సీసీరోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 743 రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. మరో 344 రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలో వాటికి కూడా నిధులు మంజూరవుతాయి. మార్చి 31 లోపు పనులను పూర్తి చేస్తాం. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
– ప్రభాకర్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ
మండలం రోడ్లు నిధులు(రూ.లలో)
ఆసిఫాబాద్ 95 3.34 కోట్లు
జైనూర్ 114 రూ.4.41 కోట్లు
కెరమెరి 113 రూ.3.75 కోట్లు
లింగాపూర్ 81 రూ.3.85 కోట్లు
రెబ్బెన 44 రూ.1.59 కోట్లు
సిర్పూర్(యూ) 53 రూ.1.76 కోట్లు
తిర్యాణి 38 రూ.1.48 కోట్లు
వాంకిడి 49 రూ.2.32 కోట్లు
బెజ్జూర్ 24 రూ.1.20 కోట్లు
చింతలమానెపల్లి 20 రూ.కోటి
దహెగాం 34 రూ.1.75 కోట్లు
కాగజ్‌నగర్ 22 రూ.1.17 కోట్లు
కౌటాల 15 రూ.75 కోట్లు
పెంచికల్‌పేట్ 18 రూ.90 కోట్లు
సిర్పూర్(టి) 23 రూ.1.18 కోట్లు


