ఆసిఫాబాద్‌రూరల్: మిషన్ భగీరథ ద్వారా మారుమూల ప్రాంతాలకు శుద్ధజలం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం మండలంలోని తుంపెల్లి గ్రామానికి మిషన్ భగీరథ ద్వా రా సరఫరా చేస్తున్న నీటిని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల ని సూచించారు. ఎక్కడైనా పైపులైన్ లీకేజీలుంటే వెంటనే మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని, ఇందుకు మిషన్ భగీరథ ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వేసవిలో బావులు, బోర్లు అడుగంటితే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీవో భిక్షపతి, ఎంపీవో మౌనిక తదితరులు పాల్గొన్నారు.