కౌటాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణం తీయొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం చుట్టూ నదులున్నా ప్రయోజనం లేదన్నారు. రైతుల కోసం 16 ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి తరలించి నవ్వుల పాలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సిర్పూర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించలేకపోతోందన్నారు. ఈ వేసవిలో ప్రాణహిత ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్టును నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 60 శాతం నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్‌గౌడ్, మండలాధ్యక్షుడు కుంచాల విజయ్, నాయకులు రవి, చందు, అశోక్, సత్తయ్య, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.