చుట్టపు చూ‘పులే’..!
జిల్లా అడవులను వీడిన పులులు
అనుకూల ఆవాసానికి వెతుకులాట
‘కవ్వాల్’ కోర్‌లోనూ ఆగని బెబ్బులి
గోదావరి దాటి పొరుగు జిల్లాలకు..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ వచ్చిన వలస పులులు జిల్లాను విడిచివెళ్లాయి. ఇటీవల జిల్లా అడవుల్లోకి కొత్తగా వచ్చిన మూడు పులులు జిల్లా సరిహద్దులను దాటి పోయాయి. కొద్ది రోజులుగా చెన్నూరు, భీమారం, జైపూర్, శ్రీరాంపూర్ వరకు వచ్చిన ఓ మగ పులి పది రోజుల క్రితమే గోదావరి దాటి మంథని మీదుగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ వరకు వెళ్లింది. మరో పులి గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించి మానేరు వాగు తీరం వెంబడి తిరుగుతోంది. సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాలు, పరిసర గ్రామ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఇక జన్నారం డివిజన్‌లో సంచరించిన పులి ఇందన్‌పల్లి మీదుగా గోదావరి దాటి సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దు అడవుల్లో తిరుగుతోంది. ఇలా.. కొత్తగా వచ్చిన మూడు పులులు ప్రస్తుతం జిల్లా దాటి వెళ్లిపోయాయి. ఈ పులులు మహారాష్ట్ర నుంచి తమ అనుకూల ఆవాసం కోసం వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుండడం గమనార్హం. మరోవైపు జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి డివిజన్ల మధ్య ర్యాలీ, గడ్‌పూర్, దేవాపూర్, తిర్యాణి అడవుల మధ్య మరో పులి సంచరిస్తోంది. అలాగే, వేమనపల్లి మండలం నీల్వాయి, ప్రాణహిత తీర అటవీ పరిసర ప్రాంతాల్లో మరో పులి తిరుగుతోంది.
ఆవాసం, తోడు వెతుక్కుంటూ..
కొత్త పులులు జిల్లా అడవుల్లోకి ప్రవేశించగానే వాటి సంచారంపై అటవీ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వాటి కదలికలు తెలుసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లా అడవుల్లో రెండు పులులు సంచరించిన విషయం తెలిసిందే. జిల్లాలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టులు, గోదావరి తీర ప్రాంతాలతో పాటు అడవుల్లో పులులు సంచరిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులకు ఇక్కడ అనుకూలమైతేనే ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. ఇక్కడి అడవుల్లో పరిస్థితులు అనుకూలిస్తేనే కొంతకాలం ఉంటున్నాయి. లేకపోతే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో స్థానికులకు తారసపడుతున్నాయి. అలాగే రైతుల పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఇటీవల సంచరించినవి రెండు మగ పులులుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇవి తోడు కోసమే ఆడపులుల కోసం తిరుగుతున్నాయా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఏటా చలికాలంలో పులులు తోడు వెతుక్కునే అవకాశాలుంటాయని చెబుతున్నారు.
కోర్‌లోకి వెళ్లలేక..
కవ్వాల్ పులుల అభయారణ్యం పులుల ఆవాసంగా ఉంది. అన్ని అనుకూలతలున్న వందల ఎకరాల భూమి కోర్ పరిధిలోనే ఉంది. అయితే.. ఇప్పటికీ ఒక్క పులి కూడా ఆవాసమేర్పరుచుకోలేదు. ఏటా సీజన్‌లో అప్పుడప్పుడు వచ్చి వెళ్లడమే గాని పులులు ఇక్కడ స్థిరంగా ఉండడం లేదు. కోర్ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. అటవీ సమీపంలో భూములు ఉండడంతో స్థానికులకు కంట పడుతున్నాయి. మరోవైపు ప్రాణహిత, గోదావరి తీరాలతో పాటు వాగులు, వంకలు, దట్టమైన పొదల్లో ఉంటున్నాయి. అ యితే.. ఇటీవల శ్రీరాంపూర్ ఆర్కే–8 పరిస ర ప్రాంతంలో ఓ పులి కనిపించింది. భీమా రం మండలం నరసింహాపురం బస్టాప్ సమీప వాగులో దాని పాదముద్రలను అట వీ అధికారులు గుర్తించారు. ఇదే తీరుగా నెలన్నరగా పులులు జిల్లాలో సంచరించా యి. గోదావరి తీరాలు, నీటి కుంటలు, వా గుల వెంట అడవుల్లో కలియదిరుగుతున్నా యి. అయితే.. ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు జిల్లాలో స్థిర నివాసమేర్పరుచుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. కాగా, మళ్లీ ఆ పులులు తిరిగి జిల్లా అడవుల్లోకి వచ్చే అవకాశముందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.


