ఆసిఫాబాద్: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా టాస్క్‌ఫోర్స్ సమన్వయ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి మొదటి వారం నుంచి ఎండ తీవ్రత పెరిగినందున ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించా రు. వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపు పనులు ముగించుకోవాలని సూచించారు. పనిప్రదేశాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటితొట్టీలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సీతారాం, డీపీవో భిక్షపతి, డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీవో రాంచందర్, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య పాల్గొన్నారు.


