సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో నెలకొన్న విబేధాల దాగుడుమూతల వ్యవహారానికి పూర్తిగా తెరపడ్డట్లయింది. ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఎదుటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽధిలోని ముఖ్య నాయకులు పార్టీ స్థితిగతుల గురించి చెబుతూ వాపోయారు. వ్యవహారం ఇలాగే కొనసాగితే పార్టీ పూర్తిగా పట్టు కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు జిల్లా నేత ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం శృతిమించిపోయిందని ఇన్‌చార్జి ఎదుట నేరుగా ఆ నేత పేరు చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీలో సంచలనం కలిగిస్తోంది. మొత్తంగా పార్టీ పరిస్థితులను చక్కదిద్దాలంటే ఇక్కడ ప్రత్యేక కమిటీలు నియమించాల్సిందేనని రాష్ట్ర ఇన్‌చార్జి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆ దిశగా కార్యచరణకు సిద్ధం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది.
దిద్దుబాటు చర్యలేవి?
కాంగ్రెస్‌లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచే నెలకొన్న విబేధాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. పార్టీలో ముఖ్య నాయకులు ఇన్నాళ్లు చెప్పుకోలేని పరిస్థితిలో మౌనం దాల్చగా, కొత్తగా నియమితులైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాక, ఆమె సమావేఽశంలో ఏ విషయాన్నైనా నేరుగా చెప్పండని నాయకులతో పేర్కొనడంతో వారు కూడా ధైర్యం చేసి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఆమె ముందు ఏకరువు పెట్టారు. దీంతో కొన్నాళ్లుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీలో తీవ్రరూపం దాల్చిన పరిస్థితులు రాష్ట్ర ఇన్‌చార్జి దృష్టికి వెళ్లాయి. బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఇన్‌చార్జితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ పరిధి నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి ఐకే రెడ్డి, వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ దండే విఠల్, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, శ్రీహరిరావు, ఆడె గజేందర్, సీనియర్ నాయకులు నరేశ్‌జాదవ్, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్‌రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపూరావు తదితరులు హాజరయ్యారు.
సమన్వయ లేమితోనే..
ఈ దశలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నేతల మధ్య సమన్వయలేమి ఉందని రాష్ట్ర ఇన్‌చార్జి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి ఇవే కారణమయ్యాయని ఆమె వివరించారు. రాష్ట్ర కేబినెట్‌ను పూర్తిస్థాయిలో విస్తరించిన తర్వాత, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జిగా తాను తప్పుకొంటానని సీతక్క పేర్కొనడం ఈ సమావేశంలో కలకలం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్‌లో పార్టీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని, ఈ సమస్యను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)కి సిఫారసు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఓ త్రీమన్ కమిటీని నియమించి పార్టీని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అంతే కాకుండా జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి డీసీసీ, నామినేట్ పదవుల నియామకంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
పక్క జిల్లా నేత జోక్యంపై గుస్సా
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిఽధిలో గత ఎన్నికలకు ముందు నుంచి పక్క జిల్లా నేత జోక్యం చేసుకోవడం, అన్ని వ్యవహారాల్లో కల్పించుకోవడంపై జిల్లా నాయకులు రాష్ట్ర ఇన్‌చార్జికి ఫిర్యాదు చేశారు. అసలు జిల్లాకు ఆయనకు సంబంధం లేకపోయినా అన్ని వ్యవహారాల్లో ఆయనే జోక్యం చేసుకోవడమేమిటని వారు ఆవేదన వెల్లగక్కారు. ఈ విషయంలో ఒకరిద్దరు నాయకులు ఆ నేత తీరును వివరించినప్పటికీ, మొదట పేరు చెప్పనట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఇన్‌చార్జి జోక్యం చేసుకుని నేత పేరు చెప్పాలని నాయకులతో పేర్కొనడంతో వారు ధైర్యం చేసి అందిరి ముందే అతడి పేరు వెల్లడించినట్లు సమాచారం. దీంతో సమావేశంలో కొంతమంది నేతలకు ఈ పరిస్థితి మింగుడుపడని విధంగా మారినట్లు చెప్పుకొంటున్నారు. అంతే కాకుండా జిల్లాతో సంబంధమున్న ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఫోన్ చేసినా లేపడం లేదని కాగజ్‌నగర్‌కు చెందిన ఓ నేత రాష్ట్ర ఇన్‌చార్జి ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో
పట్టు పోతోందన్న కాంగ్రెస్ నేతలు
పక్క జిల్లా నేత కారణమని ఆరోపణ
పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఎదుట ఆవేదన
సమన్వయం లేదన్న మంత్రి సీతక్క
దిద్దుబాటు చర్యలకు ప్రత్యేక కమిటీ
నేతల మధ్య కుదరని సయోధ్య
పార్టీలో పాత నాయకులు తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఓ వైపు వాపోతుండగా.. పార్టీ లోకి వచ్చిన ముఖ్య నేతలు తమకు పార్టీలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని రాష్ట్ర ఇన్‌చార్జి ఎదుట ఏకరువు పెట్టినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ తనకు నియోజకవర్గంలో పర్యటనలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండి, ఆతర్వాత ఇతర పార్టీలోకి వెళ్లిన తాను మళ్లీ మాతృ పార్టీలోకి వచ్చిన తర్వాత గుర్తింపు లభించడం లేదని ఇన్‌చార్జి ఎదుట వాపోయినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి అని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ పరిధిలో పార్టీ పరంగా ఉన్న పరిస్థితులు రాష్ట్ర ఇన్‌చార్జి దృష్టికి వెళ్లడంతో ఇకనైన పార్టీని గాడిలో పెడతారా.. అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


