అక్వాన్‌తో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అక్వాన్‌తో ఆందోళన

Nov 19 2026 12:31 AM | Updated on Nov 19 2026 12:31 AM

మొన్నటి తుపాన్లతో

23వేల ఎకరాల్లో పంటలకు నష్టం

ఇంతలోనే ముంచుకొచ్చిన

మరో గండం

జిల్లాలో భారీ వర్ష సూచనతో

రైతుల్లో ఆందోళన

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పంటల సాగుకు అనువైన కాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఎలాగోలా తిప్పలు పడి రైతులు సాగు చేయగా, పండిన పంటలకు డిమాండ్‌ ఉన్న క్రమంలో తుపాన్లు రైతుల సంతోషాన్ని ఆవిరి చేశాయి. ఇటీవల వచ్చిన అర్నబ్‌, మురసు మిగిల్చిన నష్టం నుంచి తేరుకోకముందే, అక్వాన్‌ తుపాన్‌ ప్రభావం మొదలుకావడంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ తుపాన్‌ ప్రభావం గురువారం నుంచి 22 వరకు ఉంటుందని, 20, 21వ తేదీల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో పంటను కాపాడుకోవడం ఎలా అన్న ఆందోళన మొదలైంది.

అప్పుడు అలా..

ఈ ఏడాది వానాకాలంలో ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి, వర్షాలు ముఖం చాటేశాయి. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం పంటల సాగుకు సహకరించలేదు. బోర్లు, బావుల కింద రైతులు పంటలను సాగు చేసినా భూగర్భ జలాలు అడుగంటి చేన్లు వడపడ్డాయి. ఈ సీజన్‌లో కేవలం సెప్టెంబర్‌లోనే రెండు రోజులు వర్షం కురవగా, గోదావరి జలాల సాయంతో కొంత మేర పంటలను రక్షించుకోగలిగారు. అరకొరగా పండిన పంటకు మంచి డిమాండ్‌ ఉండడంతో పెట్టుబడులైనా దక్కుతాయని ఆశించారు.

పంటలు వర్షార్పణం

వానాకాలంలో అరకొరగా పండిన వరి, పత్తి చేతికొచ్చే క్రమాన మొదట అర్నబ్‌, ఆ తర్వాత మురసు తుపాన్లు దెబ్బతీశాయి. ప్రధానంగా వరి నేలవాలడంతో మొలకలొచ్చాయి. గింజలు తడవడంతో పత్తి నీరుగారింది. ఓ వైపు పొలాల్లో పంటలు దెబ్బతినగా, ఆరబోసిన ధాన్యం, పత్తి తడిసి ముద్దయ్యాయి. ఇక మిర్చి చేన్లలో నీరు చేరి మొక్కలు కుళ్లిపోయాయి.

కొనసాగుతున్న సర్వే

రెండు తుపాన్ల ధాటికి జిల్లాలో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 23,140 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వ సూచనలతో పంట నష్టాన్ని గుర్తించేందుకు అధికారులు చేపట్టిన సర్వే కొనసాగుతోంది.

ముంచుకొచ్చిన మరో తుపాన్‌

ఇప్పటికే రెండు తుపాన్లతో పంటలు తుడిచిపెట్టుకుపోగా.. ఇంతలోనే ‘అక్వాన్‌’ తుపాన్‌ ముంచుకొ చ్చింది. మళ్లీ భారీ వర్షం కురిస్తే కల్లాలు, పొలాల్లో ఉన్న అరకొర పంట చేతికి రాదని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తుపాన్‌ ప్రభావం జిల్లాలో గురువారం నుంచి 22వ తేదీ వరకు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించగా.. 20, 21వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ఆలోగా వరి కోతలు పూర్తి చేయడంతో పాటు చేన్లలో మిగిలిన పత్తి తీయించేందుకు రైతులు హడావుడి పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement