ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం శ్రీస్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదానికి, విగ్రహానికి వేదమంత్రాలతో, శాస్త్రోక్తంగా పంచామృతంతో అభిషేకం చేశారు. శ్రీస్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి కల్యాణం జరిపించారు. శ్రీవారికి భక్తులు, అర్చకులు పల్లకీ సేవ చేశారు. మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.ప్రశాంతి శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ జగన్మోహన్‌రావు, ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది సోమయ్య, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
ఆరోగ్య పరీక్షలు
నిర్వహించాలి
ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) బృందాలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు ఆదేశించారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆర్‌డీఎస్‌కేపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులలో పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకాహార లోపాలు, రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
నైపుణ్య కోర్సులపై అవగాహన
ఖమ్మం రాపర్తినగర్: నైపుణ్య కోర్సులు నేర్చుకుని నిరుద్యోగులు ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి అన్నారు. శనివారం నగరంలోని టేకులపల్లి మోడల్ కెరీర్‌సెంటర్‌లో జరిగిన నైపుణ్య కోర్సుల ఉచిత అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సిబ్బంది నాగమణి, సంయుక్త, కుమార్, శబరి, పంతులు పాల్గొన్నారు.
నేడు ఉపాధ్యాయులకుటెట్
ఖమ్మం సహకారనగర్: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఆదివారం టెట్–2 పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 926 మంది ఉపాధ్యాయులు పరీక్షలు రాయనున్నారు. పేపర్–1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వాసంతి తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
బాస్కెట్‌బాల్ టోర్నీ ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–14 బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీలు శనివారం ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. పోటీలను ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజా లక్ష్మి, హార్వెస్ట్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆర్. పార్వతీరెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.చిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ దేశంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఉందని అన్నారు. తొలిరోజు నిర్వహించిన పోటీల్లో ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, జట్లు విజయం సాధించాయి. మూడు రోజులపాటు పోటీలు నిర్వహించనున్నారు. సీనియర్ పీడీలు పీవీ రమణ, కృష్ణమూర్తి, నాగయ్య, రామారావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


