ఖమ్మం సహకారనగర్: జిల్లా అభివృద్ధి, ప్రణాళిక రూపకల్పన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్‌లతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో 2032 మార్చి నాటికి రైతుల నికర ఆదాయాన్ని 15 శాతం మేర పెంచేలా, 5 వేల ఎకరాల్లో లాభదాయక సాగు పద్ధతులను విస్తరించేలా, డ్రోన్ల వినియోగం, యాంత్రీకరణపై చర్యలు తీసుకునేలా ప్రణాళిక ఉండాలన్నారు. ఉద్యానవన శాఖ పరిధిలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు డ్రిప్ ఆటోమేషన్ పెంచాలని, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 2030 నాటికి పశువుల్లో గాలికుంటు, పీపీఆర్, రేబిస్ వ్యాధుల పూర్తి నిర్మూలన, 4 వేలకు పైగా పశువుల షెడ్ల నిర్మాణం, పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధి, మత్స్య శాఖ ద్వారా చెరువుల అభివృద్ధి, ఆధునిక మత్స్య మార్కెట్ల నిర్మాణం, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు వంటి అంశాలపై దృష్టి సారించాలని వివరించారు. జిల్లాలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నూతన 33/11 కేవీ సబ్–స్టేషన్ల నిర్మాణం, ఓవర్‌లోడ్ ఫీడర్ల విభజన, భూగర్భ కేబుల్ పనులు, వినియోగదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. టీజీ రెడ్కో ద్వారా పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్, మోడల్ సోలార్ గ్రామాల పథకాల కింద సోలార్ రూఫ్‌టాప్‌లు, వ్యవసాయ సోలార్ పంపుసెట్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. 2028 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.5 లక్షలకు, 2033 నాటికి రూ.10 లక్షలకు పెంచే లక్ష్యంతో శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకుముందు కలెక్టర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష చేశారు. జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ ఎన్. శ్రీనివాస్, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర


