ఖమ్మంఅర్బన్: పంటలు ఎండిపోకుండా ఆదుకోవాలని రైతులు కోరడంతో చివరి తడి కోసం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు విడుదల చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్దనున్న ప్రాజెక్ట్ మొదటి పంప్‌హౌస్ నుంచి శనివారం నీటిని విడుదల చేయగా, వైరా–ఏన్కూరు, అన్నపురెడ్డిపల్లి, రామచంద్రపురం మేజర్ కాలువలకు ఆదివారం చేరుకోనుంది. పంటలు కీలక దశలో ఉన్నాయని, చివరి తడి అందకపోతే దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి సాగునీటి విడుదలకు అధికారులను ఆదేశించారు.
ఐదో విడత విడుదల
ఖమ్మం జిల్లాకు ఐదో విడతగా గోదావరి జలాలను శనివారం రాజీవ్ లింక్ కాల్వ ద్వారా విడుదల చేసినట్లు జల వనరులశాఖ సీఈ వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తరలించి సాగర్ ఆయకట్టుతోపాటు తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నా సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కాగా, ఈ ఏడాది జూలై 10 నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో 9.11 టీఎంసీల గోదావరి జలాలను ఖమ్మానికి విడుదల చేశారు. ఇందులో 3.66 టీఎంసీల నీటిని 123 చెరువులకు మళ్లించి, సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు అందించారు. 5.45 టీఎంసీల నీటిని మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు సరఫరా చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


