అప్రమత్తతతోనే శాంతిభద్రతల పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే శాంతిభద్రతల పరిరక్షణ

Nov 19 2026 12:31 AM | Updated on Nov 19 2026 12:31 AM

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

కొణిజర్ల: పోలీసులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ శాంతి భద్రత పరిరక్షణకు పాటుపడాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌ దత్‌ సూచించారు. కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ను బుధవా రం తనిఖీ చేసిన ఆయన ఆవరణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై సూచనలు చేశారు. సెక్టార్‌ ఆఫీసర్లు వారి గ్రామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నేరాల కట్టడికి పాటుపడాలని తెలిపారు. అలాగే, సమస్యాత్మక ప్రాంతాలు అంశాలపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. సీసీ కెమెరాలతో ఉపయోగంపై ప్రజలకు వివరించాలని, సైబర్‌ మోసాల బారిన పడకకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ వారి ఆర్థిక కార్యకలాపాలను కూడా పరిశీలించాలని సూచించారు. వైరా సీఐ వెంకటప్రసాద్‌, ఎస్‌ఐ దుద్దకూరి హరిత, సిబ్బంది పాల్గొన్నారు.

ఈనెల 23న

సింథటిక్‌ ట్రాక్‌ ప్రారంభం?

ఖమ్మం మయూరిసెంటర్‌(ఖమ్మం స్పోర్ట్స్‌): ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఏర్పాటుచేసిన సింథటిక్‌ ట్రాక్‌ను ఈనెల 23న ప్రారంభించనున్నట్లు తెలిసింది. వచ్చేనెల 9న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉండడంతో, ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని భావించారు. అయితే, డిసెంబర్‌ 17నుంచి ఖేలో ఇండియా టోర్నీలో భాగంగా ఆర్చరీ పోటీలకు వేదికగా స్టేడియంను ఎంపిక చేశారు. దీంతో టోర్నీ ఏర్పాట్లు, స్టేడియం ఆధునికీకరణకు రూ.2కోట్లు కేటాయించారు. ఈ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున సింథటిక్‌ ట్రాక్‌ను ముందుగా ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రూ.8.50కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రాక్‌ను ఈనెల 23న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి ప్రారంభించే అవకాశముందని సమాచారం.

యాసంగిలో ఏం పంటలు సాగు చేస్తారు?

● పంట మార్పిడిపై వ్యవసాయ శాఖ సర్వే

ఖమ్మంవ్యవసాయం: ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్‌లో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న కాకుండా ఆరు తడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. వరి స్థానంలో అపరాల పంటలైన పెసర, మినుముతో పాటు కూరగాయల పంటల సాగును ప్రోత్సహించేలా విత్తనాలను సబ్సిడీపై అందించనున్నారు. ఈ నేపథ్యాన రైతులు ఏమేం పంటలు సాగు చేయనున్నారో తెలుసుకునేందుకు ఏఈఓలతో సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏటా యాసంగిలో 2.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. కానీ ఈసారి ప్రభుత్వం, అధికారులతో సూచనలతో రైతులు గ్రామాల వారీగా ఏ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారో వివరాలు సేకరిస్తున్నారు. రైతులు నష్టపోకుండా, తక్కువ నీరు అవసరమయ్యే పంటలనే సాగు చేసేలా అవగాహన కల్పించడమే ఈ సర్వే ఉద్దేశమని వ్యవసాయ అధికారులు తెలిపారు.

మెనూ అమలులో

లోపాలు రావొద్దు

ఏన్కూరు/కారేపల్లి: వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూలో తేడా రాకుండా భోజనం సమకూర్చాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.ఫిరంగి సూచించారు. ఏన్కూరు మండలం మూలపోచారం, కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి ఆశ్రమ పాఠశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి, వసతి గదులు, స్టోర్‌రూంను పరిశీలించి మాట్లాడారు. మెనూ అమలు, సరుకుల నిల్వ, నాణ్యతపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని తెలిపారు. పాఠ్యాంశాల బోధనపై శ్రద్ధ వహించాలని చెప్పారు. ఆ తర్వాత విద్యార్థుల పఠనా సామర్థ్యాలను డీడీ పరీక్షించారు. ప్రధానోపాధ్యాయులు జి.నాగరాజు, ధర్మా, డిప్యూటీ వార్డెన్లు నాగేశ్వరావు, గోపి, ఉపాధ్యాయులు శ్యామల, రవి, చందర్‌రావు, వసంతదేవి, ఉషశ్రీ, వెంకటరమణ, సక్రాం, రాందాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement