‘గిరి’ కుటుంబాల చెంతకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

‘గిరి’ కుటుంబాల చెంతకు న్యాయం

Oct 25 2026 12:41 AM | Updated on Oct 25 2026 12:41 AM

● క్షేత్రస్థాయిలో ‘నాల్సా’ పథకాల అమలు ● డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యాన ముగిసిన మెగా డ్రైవ్‌

● క్షేత్రస్థాయిలో ‘నాల్సా’ పథకాల అమలు ● డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యాన ముగిసిన మెగా డ్రైవ్‌

ఖమ్మం లీగల్‌: న్యాయాన్ని అందించడం అంటే కోర్టుల్లో కేసుల పరిష్కారానికే పరిమితం కాదు. రోజువారీ కూలీలు, కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడం, దివ్యాంగుడికి పరికరం అందించడం వంటివన్నీ ఇందులో భాగమే. అలాగే, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందేలా తోడ్పడడం కూడా ఇందులో భాగమే అవుతుంది. ఈ నేపథ్యాన విస్తృత దృక్పథంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ చేపట్టిన 60 రోజుల పాటు చేపట్టిన మెగా డ్రైవ్‌ శుక్రవారంతో ముగిసింది. బలహీన వర్గాల ప్రజలను చేరుకోవడం, వారి అవసరాలను గుర్తించి జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ శాఖల సమన్వయంతో చట్టపరమైన రక్షణ అర్హతలకు అనుగుణంగా ప్రయోజనాలు అందేలా సహకరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది.

గిరిజన, వెనుకబడిన కుటుంబాల కోసం

జాతీయ న్యాయసేవల అధికార సంస్థ(నాల్సా), రాష్ట్ర న్యాయసేవల అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గిరిజన కుటుంబాలు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉచిత న్యాయసాయం అందించేందుకు మెగా డ్రైవ్‌ నిర్వహించారు. ఆగస్టు 25న ప్రారంభమైన మెగా డ్రైవ్‌ ఈనెల 23తో ముగిసింది. గిరిజన హక్కుల పరిరక్షణ, అమలు పథకం, పేదరిక నిర్మూలన పథకాల సమర్థవంతమైన అమలు పథకం, అసంఘటిత రంగ కార్మికులకు న్యాయసేవల పథకం లక్ష్యాలకు అనుగుణంగా ఈ డ్రైవ్‌ సాగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్‌ ఎం.నాగరాజు నాయకత్వాన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి.దేవీమానస సమన్వయం చేస్తూ డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది, పారా లీగల్‌ వలంటీర్ల సహకారంతో పూర్తిచేశారు.

విస్తృత సేవలు

గ్రామస్థాయిలో ప్రజలను చేరుకోవడం, వారి అవసరాలను గుర్తించి, దరఖాస్తుల నమోదు, ఆపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసేలా 20 మంది పారా లీగల్‌ వలంటీర్లను నియమించారు. డీఎల్‌ఎస్‌ఏ సిబ్బందితో కలిసి వారు ప్రజలు – అధికారులకు అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించారు. న్యాయసేవలు ఎక్కడ లభిస్తాయో చెప్పడం, లేదంటే దరఖాస్తులు పూర్తిచేయించారు. ఈక్రమాన 424 గృహాల్లో 1,243 మంది జనాభా, ఇందులో 1,063 మంది గిరిజనులు ఉన్న సత్తుపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరిని కలిసి అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో సహకరిస్తూ సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు అర్హులకు అందిన ఆధార్‌ కార్డులు, ఇతర పత్రాలతో పాటు దివ్యాంగులకు మంజూరైన సహాయ ఉపకరణాలను ఈనెల 17న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఖమ్మం పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్‌ సూరేపల్లి నందా చేతుల మీదుగా పంపిణీ చేశారు.

వారధిగా డీఎల్‌ఎస్‌ఏ

బలహీన వర్గాల ప్రజలకు చట్టపరమైన రక్షణ, ప్రభుత్వ సేవలు అందించడంలో డీఎల్‌ఎస్‌ఏ వారధిగా నిలుస్తోంది. న్యాయసేవల సిబ్బంది, జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ శాఖలు, వలంటీర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా నాల్సా పథకాల లక్ష్యాలను సాయంగా మార్చడానికి కృషి చేసింది. గిరిజనులకు హక్కులను వివరించడమే కాక వాటిని వినియోగించుకునేలా అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement