డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
చింతకాని మండలంలో పనులకు
శంకుస్థాపన
చింతకాని: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. గ్రామాల్లో రహదారులు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో శనివారం డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక భట్టి మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తమ ప్రభుత్వం నమ్ముతోందని తెలిపారు. ఈమేరకు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు చేపడుతున్నామని.. తద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులభమవుతాయని పేర్కొన్నారు. అంతేకాక నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం, తాగునీటి పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
సబ్‌స్టేషన్లు, రహదారుల అభివృద్ధి
చింతకాని మండలం ప్రొద్దుటూరులో రూ.3.5 కోట్లతో నిర్మించే సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాఫన చేశారు. అలాగే, తిమ్మినేనిపాలెంలో రూ.8.25 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, దేవరపల్లి హైవేను కలుపుతూ రామకృష్ణాపురం – కొత్తగూడెం వరకు రూ.3 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, రామకృష్ణాపురం – పెద్దగోపతి రోడ్డు వరకు రూ.50 కోట్లతో చేపట్టే రహదారి విస్తరణ పనులు, కొదుమూరులో వెంకటాయపాలెం – చింతకాని రోడ్డు వరకు రూ.60 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాక తిమ్మినేనిపాలెం ఎస్సీ కాలనీలో రూ.62 లక్షలు, గాంధీనగర్ ఎస్సీ కాలనీలో రూ.46 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును భట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రావు, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, చీఫ్ ఇంజనీర్ సురేందర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో పాటు సర్పంచ్‌లు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


