● మిర్చిని ఆశించిన బొబ్బ తెగులు ● మూడున్నర ఎకరాల్లో పంట తొలగించిన రైతు
మధిర : మధిర మండలం మల్లారం గ్రామానికి చెందిన ఓ రైతు ఆరుగాలం శ్రమించి, నీటి ఎద్దడిని అధిగమిస్తూ నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. త్వరలోనే పంట చేతికి వస్తుందని ఆశిస్తుండగానే తోటకు వైరస్ సోకడంతో ఇక పెట్టుబడి పెట్టే స్తోమత లేక కన్నీటి సుడుల నడుమ దున్నించేసిన ఘటన ఇది. మల్లారం గ్రామానికి మందడపు నాగకృష్ణ సిరిపురం సమీపాన నర్సరీలో మిరప నారు కొనుగోలు చేసి నాలుగెకరాల్లో నాటాడు. ఎరువులు, పురుగు మందులు, కూలీలు, పైపాటు కోసం ఇప్పటివరకు సుమారు రూ.4లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పంట చేతికొస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భావించాడు. కానీ మిర్చి పైరును బొబ్బ తెగులు ఆశించింది. దీంతో చేసేదేం లేక పచ్చని పంటను ట్రాక్టర్‌తో శనివారం దున్నించాడు. గత ఏడాది ఇదే విత్తనం సాగు చేయగా వాతావరణం అనుకూలించి మంచి దిగుబడి వచ్చింది. దీంతో నమ్మకంగా ఈ ఏడాది కూడా అదే కంపెనీకి చెందిన విత్తనాన్ని సాగు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితం లేక అర ఎకరం మినహా 3–50 ఎకరాల్లో పంటను పూర్తిగా తొలగించాడు. ప్రస్తుతం పొలాన్ని చదును చేయిస్తుండగా జామాయిల్ సాగు చేయనున్నట్లు నాగకృష్ణ వెల్లడించాడు.


