22 ఏ సెక్షన్ అంటే..
‘22 ఏ’ జాబితాలో 2,92,819
ఎకరాల ప్రభుత్వ భూమి
ప్రైవేట్ భూములు కూడా చేరడంతో యజమానుల్లో గందరగోళం
అమ్ముకోలేక.. రిజిస్ట్రేషన్ జరగక
ఆందోళన
రెవెన్యూశాఖ వద్ద
158 ఫిర్యాదుల నమోదు
జిల్లావ్యాప్తంగా 22ఏ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భూభారతి చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత జాబితాలో జిల్లాకు చెందిన ప్రైవేట్ పట్టా భూములు చేరడం చర్చనీయాంశంగా మారింది. నిషేధిత జాబితాలో ప్రభుత్వ ఆధీనంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కలిపి 2,92,819.67 ఎకరాలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇదే సమయాన ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఉండడంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈక్రమాన జిల్లాలో అందిన ఫిర్యాదుల పరిశీ లన, పరిష్కారంలో యంత్రాంగం నిమగ్నమైంది.
ఏమవుతుంది.. ?
22ఏ నిషేధిత జాబితాలో ప్రైవేట్ వ్యక్తుల భూములు చేరితే ఆ ఆస్తికి సంబంధించి సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, తనఖా లేదా పవర్ ఆఫ్ అటార్నీ వంటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోతాయి. ఇదే సమయాన యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా రద్దు కావు. రికార్డుల ప్రకారం యజమాని పేరు ఉన్నా ఇతరులకు బదిలీ చేయడం కుదరదు. ఫలితంగా టైటిల్‌పై స్పష్టత లేక బ్యాంకుల నుంచి గృహ లేదా ఇతర రుణాలు ఇవ్వరు. పలువురు తమ భూముల క్రయవిక్రయాల సమయాన రిజిస్ట్రేషన్ కాకపోవడంతో నిషేధిత జాబితాలో ఉన్నట్లు గుర్తించారు.
గందరగోళ పరిస్థితులు
గతంలో ధరణిలో జరిగిన తప్పులను సరి చేసేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. జిల్లాలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, మిగులు భూములు, స్థానికసంస్థలకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కలిపి 2,92,819.67 ఎకరాలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇందులో 22ఏ జాబితాలోకి ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా చేరడంతో వారి అమ్ముకోలేకపోతున్నారు. అత్యధికంగా కల్లూరు డివిజన్‌లోని సత్తుపల్లి మండలంలో 40,447.14, పెనుబల్లి మండలంలో 36,675.23 ఎకరాలు నిషేధిత జాబితాలో చేరాయి. ఖమ్మం డివిజన్ కొణిజర్లలో 25,806.01, సింగరేణి మండలంలో 23,665.29 ఎకరాలు ఉన్నాయి.
దిద్దుబాటు చర్యలు
కొద్ది కాలంగా 22ఏ నిషేధిత భూములపై రాష్ట్రవ్యాప్తంగా వివాదం కొనసాగుతోంది. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో యజమానులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ప్రైవేట్ భూములు, ఓపెన్ ప్లాట్లు, నివాస గృహాలు జాబితాలో చేరాయి. ఈక్రమాన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నిషేధిత జాబితాలోని ప్రైవేట్ భూములను తొలగింపునకు కసరత్తు మొదలుపెట్టింది.
ప్రభుత్వ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూమి అక్రమంగా చేతులు మారకుండా నిరోధించడానికి భారత రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22 ఏను పొందుపరిచారు. ఈ జాబితా లో ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులతో పాటు అసైన్డ్ భూములు, హిందూ ఆలయాలు, ట్రస్ట్‌లు, ఇతర దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, సీలింగ్ మిగులు భూములు, కోర్టుల ద్వారా జప్తు చేయబడిన లేదా నిషేధాజ్ఞలు ఉన్న ఆస్తులు ఉంటాయి. వీటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చట్టాన్ని తీసుకొస్తే భూభారతి ద్వారా కొందరి భూములు చేరాయి.
విభాగం వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి మొత్తం
అసైన్డ్ భూములు 2,03,501.37 10,759.28 2,14,260.65
ప్రభుత్వ ఆస్తులు 69,215.15 --- 69,215.15
మిగులు భూములు 9,003.31 9.02 9,012.33
ప్రభుత్వ, స్థానిక సంస్థల
నోటిఫైడ్ భూములు 329.25 2.29 331.54
మొత్తం 2,82,049.08 10,770.59 2,92,819.67


