● ఎల్‌నినో ఎఫెక్ట్ దారుణంగా ఉంటుంది ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
సత్తుపల్లి/వేంసూరు: పామాయిల్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరినందున వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ నిర్వహించడమే కాక బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రారంభం, బేతుపల్లి చెరువుకు గోదావరి జలాల విడుదలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. కాగా, బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు అందించాల్సి మార్గంలో కొందరు రైతులు భూములు ఇవ్వకుండా కోర్టును ఆశ్రయించారని, రాజకీయంగా అడ్డుపడడడమే కాక పరిహారం పెంచుతామని చెప్పినా వినడం లేదన్నారు. ఈమేరకు సీఎం దృష్టికి తీసుకెళ్లి ముందుగానే పరిహారం బదలాయించి కాలువ పనులను చేపట్టామని తెలిపారు. ఈ విషయమై రైతులు గ్రామాల్లో చర్చించాలని సూచించారు. అయితే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా డిసెంబర్ కల్లా గోదావరి జలాలను వేంసూరు మండలానికి చేరుస్తామని మంత్రి తెలిపారు.
నీరు, విద్యుత్‌కు కటకట
ఎల్‌నినో ప్రభావం దారుణంగా ఉంటుందని, భూగర్భ జలాలు పడిపోయి కరెంటు లేక, నీళ్లు దొరకని పరిస్థితి ఎదురవుతుందని మంత్రి తుమ్మల చెప్పారు. ఇప్పటికే జలాశయాలు డెడ్ స్టోరేజ్ కి చేరాయన్నారు. బొగ్గు నిల్వలు కూడా తగ్గడంతో డిసెంబర్ కల్లా కరెంట్ కొరత ఏర్పడుతుందని తెలిపారు. అడవిలో జంతువులు నీళ్లు లేక మృత్యువాత పడతాయని, పంటలు పండక బియ్యం ధర కేజీ రూ.100 దాటుతుందన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, ప్రధాని నుంచి సీఎం వరకు ఏమీ చేయలేరని మంత్రి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో ప్రతిపాదించిన చెక్ డ్యాములు మంజూరు చేయించాలని కోరారు. పామాయిల్ ఫ్యాక్టరీలో నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. సర్పంచ్ కొప్పుల వసంతలక్ష్మి, సత్తుపల్లి మార్కెట్ ఛైర్మన్ దోమ ఆనంద్‌బాబు, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆయిల్‌ఫెడ్ ఎండీ శ్రీకాంత్‌రెడ్డి, ఫ్యాక్టరీ ఇన్‌చార్జ్ పవన్, నాయకులు మట్టా దయానంద్, పుచ్చకాయల సోమిరెడ్డి, కాసర చంద్రశేఖరరెడ్డి, బండి గురునాథరెడ్డి, వెల్ది జగన్మోహనరావు, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొమ్మన బోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


