పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

● పార్టీలకతీతంగా అర్హులకు మంజూరు చేస్తాం.. ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

● పార్టీలకతీతంగా అర్హులకు మంజూరు చేస్తాం.. ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తిరుమలాయపాలెం: రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా కేటాయింపులు ఉంటాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని తెట్టెలపాడు నుంచి బీరోలు ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు రూ.6.50 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, సుబ్లేడులో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అలాగే, 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశాక మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తుండగా, మూడు, నాలుగో విడతల్లోనూ అర్హులకు ఇళ్లు ఇస్తామని చెప్పారు. పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, సన్నధాన్యానికి బోనస్‌, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుచేస్తోందని తెలిపారు.

రెండో పంట వేయొద్దు

ఎల్‌నినో ప్రభావంతో రానున్న నెలల్లో విద్యుత్‌, తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే, పరిస్థితులను గుర్తించి రైతులు రెండో పంట సాగు చేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ ఎస్‌ఈలు యుగంధర్‌రావు, వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ శ్రీరామ్‌, హౌసింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, ఎంపీడీఓ షేక్‌ సిలార్‌ సాహెబ్‌, సర్పంచ్‌లు నర్సమ్మ, సంగబత్తుల స్వాతి, నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్‌, కొప్పుల అశోక్‌, మంగీలాల్‌, సుమన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement