చెన్నూరుకు కల్చరల్‌ క్లబ్‌ హోదా! | - | Sakshi
Sakshi News home page

చెన్నూరుకు కల్చరల్‌ క్లబ్‌ హోదా!

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

● కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ నుంచి ఉత్తర్వులు ● ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకై క పాఠశాల ఎంపిక

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి

● కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ నుంచి ఉత్తర్వులు ● ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకై క పాఠశాల ఎంపిక

కల్లూరురూరల్‌: కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కల్లూరు మండలం చెన్నూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు కల్చరల్‌ క్లబ్‌ హోదా కల్పించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు అందాయి. దేశంలోని 50 ఉన్నత పాఠశాలలకు ఈ హోదా కల్పించగా, అందులో ఉమ్మడి జిల్లా నుంచి చెన్నూరు పాఠశాల ఎంపికై ంది. గత జూలై నెలలో చెన్నూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలు డి.శిరీషను శిక్షణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, ఢిల్లీలో 20రోజుల పాటు చిత్రలేఖనం, హస్తకళలు, భావవ్యక్తీకరణ తదితర అంశాలపై శిక్షణ పొందారు.

ఇవీ ఉపయోగాలు

చెన్నూరు హైస్కూల్‌కు కల్చరల్‌ క్లబ్‌ హోదా ఇవ్వడం వల్ల విద్యార్థులకు వివిధ కళల్లో శిక్షణ అందనుంది. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణ, గిరిజన గీతాలు, నృత్యాలు, పండుగలు, కళలు, ఆచారాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ఇష్టమైన రంగంలో శిక్షణ ఇస్తారు. కల్చరల్‌ క్లబ్‌ కార్యదర్శిగా వ్యవహరించే ఉపాధ్యాయురాలు శిరీష ఆధ్వర్యాన శిక్షణ ఉంటుంది. అంతేకాక చైర్మన్‌గా హైస్కూల్‌ హెచ్‌ఎం వి.ఝాన్సీ, అసిస్టెంట్‌ సెక్రటరీగా బి.గాంధీనాయక్‌ వ్యవహరిస్తారు.

సాహిత్యం, లలిత కళల్లో శిక్షణ

10 – 14 ఏళ్ల వయసు గల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సెంటర్‌ ఫర్‌ కల్చర్‌ రిసోర్స్‌ అండ్‌ ట్రైనింగ్‌(సీసీఆర్‌టీ) ద్వారా రూపొందించిన ప్రత్యేక సామగ్రి ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు సంబంధించి సాహిత్యం, ఇతర సామగ్రి ఇప్పటికే చెన్నూరు హైస్కూల్‌కు చేరాయి. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటే ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, కల్చరల్‌ క్లబ్‌ ద్వారా పెయింటింగ్‌, హస్తకళలు, బొమ్మలాట, నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు సంబంధించి స్థానిక కళాకారులు, నిపుణులను ఆహ్వానించి అనుభవాలను తెలియజేస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మధుబని, గోండు, కలంకారి వంటి కళారూపాలను పరిచయం చేయనున్నారు. అలాగే, నాయకత్వ లక్షణాలపైనా శిక్షణ ఇస్తారు. ఎంపిక చేసిన విద్యార్థులకు ఏటా రూ.3,600 స్కాలర్‌షిప్‌ మంజూరయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమైతే మరిన్ని హైస్కూళ్లను ఎంపిక చేయనున్నారు.

మా పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం కల్చరల్‌ క్లబ్‌ హోదా మంజూరు చేయడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చే శిక్షణతో విద్యార్థుల్లో సజనాత్మక శక్తి పెరుగుతుంది. కళలు, సంస్కృతితో పాటు విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

– డి.శిరీష, కల్చరర్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement