నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు
● మధిర నియోజకవర్గంలో తొమ్మిది పాఠశాలల ఎంపిక ● ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు ఒకేచోట బోధన
ముదిగొండ: ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్‌మీడియట్ వరకు కార్పొరేట్ స్థాయిలో ఒకేచోట బోధించేందుకు రాష్ట్రప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల(టీపీఎస్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో తొమ్మిది పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లోనే భవనాలు, వసతులు ఆధునికీకరించి, అవసరమైన నిర్మాణాలు చేపట్టి టీపీఎస్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తారు. ఇందుకోసం తొమ్మిది పాఠశాలలకు గాను రూ.57.69 కోట్లు మంజూరయ్యాయి.
మండలానికి రెండు.. మధిరలో ఒకటి
మధిర నియోజకవర్గంలో టీపీఎస్‌లుగా అప్‌గ్రేడ్ కోసం తొమ్మిది పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ముదిగొండ మండలంలోని ముదిగొండ, బాణాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మధిర మండలంలో సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోనకల్ మండలంలోని రావినూతల, చిరునోముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు చింతకాని మండలంలోని నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొదుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికయ్యాయి.
ఆధునిక వసతులతో..
నియోజవర్గంలో ఎంపికై న తొమ్మిది పాఠశాలలను ఆధునిక వసతులు, అన్ని సదుపాయాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతారు. ఈమేరకు ప్రభుత్వం రూ.57.69కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో మొదటి విడతగా రూ.17.30కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో ప్రస్తుత ఉన్నత పాఠశాలల్లో అవసరమైన భవనాలు నిర్మించి ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు బోధించేలా తీర్చిదిద్దుతారు. ఇందులో సెమీ రెసిడెన్షియల్ విధానంలో బోధన జరగనుండగా.. ఉచిత బస్ సౌకర్యంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. ఒకేసారి 500మంది విద్యార్థులు భోజనం చేసేలా డైనింగ్ హాల్‌తో పాటు ఆటల కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కల్పిస్తారు. ఖమ్మం జిల్లాలో మధిర నియోజవర్గంలోనే మొదటగా డిప్యూటీ సీఎం భట్టి చొరవతో టీపీఎస్‌లు ఏర్పాటుకానుండగా, ఇటీవల ముదిగొండ మండల పర్యటనలో వనంవారి కిష్టాపురంలో అధికారులతో సమీక్షించారు.
గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటుచేయనుండడం పేద విద్యార్థుల అదృష్టం. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందనుంది. ఒక్కో స్కూల్ ఆవరణలో 40గదులతో భవనాలు నిర్మించనున్నారు. – ఈ.వెంకట్రామిరెడ్డి, హెచ్‌ఎం,
బాణాపురం జెడ్పీహెచ్‌ఎస్


