పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆస్పత్రిలో పరామర్శించిన సీపీ సునీల్‌దత్‌

తిరుమలాయపాలెం: రాత్రివేళ పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న పోలీసుల వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటనలో తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్‌తో పాటు డ్రైవర్‌ కొత్తపల్లి రాకేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. తిరుమలాయపాలెం భవా నీ హోటల్‌ సమీపాన బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.

రెండు నిమిషాలైతే ఇంటికి..

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి వరకు కాకరవాయి, జల్లెపల్లి తదితర ప్రాంతాల్లో ఎస్సై జగదీష్‌ బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. తిరిగి తిరుమలాయపాలెం బయలుదేరగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చేపల లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ సమయాన డ్రైవర్‌ షేక్‌ రసూల్‌ లారీని వేగంగా నడుపుతుండడంతో ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఘటనలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు కాగా, ఎస్సై జగదీశ్‌ కూర్చున్న వైపు ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ రాకేష్‌ వైపు లారీ బలంగా ఢీకొట్టగా తలతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు 108 వాహనంలో ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసు వాహన డ్రైవర్‌ రాజేష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. రెండు నిమిషాలైతే ఎస్సై ఇంటికి చేరతారనగా ఈ ఘటన జరగడం గమనార్హం.

పరామర్శించిన సీపీ

పోలీసు వాహనం ప్రమాదానికి గురైందని తెలియగానే పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌, ఖమ్మం రూరల్‌, ఖమ్మం టౌన్‌ ఏసీపీలు తిరుపతిరెడ్డి, రమణమూర్తి స్పందించారు. క్షతగాత్రులను తీసుకొచ్చేలోగా ఆస్పత్రికి చేరుకుని వైద్యులను అప్రమత్తం చేశారు. అంతేకాక ఎస్సై జగదీశ్‌, డ్రైవర్‌ రాజేష్‌ వైద్యం చేసేవరకు ఉన్నారు. మరోమారు గురువారం ఉదయం ఎస్‌ఐ జగదీష్‌, డ్రైవర్‌ రాకేష్‌ పరిస్థితి ఆరా తీసి డ్రైవర్‌ను హైదరాబాద్‌ తరలించారు. కాగా, పోలీసు వాహనం నడిపిన రాజేష్‌ది మండలంలోని కాకరవాయి కాగా డిగ్రీ పూర్తయ్యాక డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. పోలీసు వాహన డ్రైవర్‌ అందుబాటులో లేకపోవడంతో బుధవారం రాకేష్‌ని పిలిపించగా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. కాగా, ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ జగదీశ్‌, డ్రైవర్‌ రాకేశ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పిండిప్రోలులో శ్రీరామ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన పూజలు నిర్వహించారు. ఉపసర్పంచ్‌ రాజుతో పాటు గ్రామస్తులు తాత రవీందర్‌, రమేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement