ప్రమిదలు, అలంకరణ సామగ్రి కూడా... పర్యావరణ పరిరక్షణ, సాఫీగా గోశాల నిర్వహణ
ఖమ్మం అర్బన్: గోసేవతోపాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఖమ్మం టేకులపల్లిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల బాధ్యులు ముందడుగు వేశారు. గోమయం, గోమూత్రాన్ని వినియోగిస్తూ పర్యావరణహితమైన విగ్రహాలు, ధూప్‌స్టిక్స్, ప్రమిదలు, ఎరువులు, అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. వినాయక చవితి, కృష్ణాష్టమి సందర్భంగా వినాయకులు, కృష్ణుడి విగ్రహాలను సహజసిద్ధమైన రంగులతో తయారు చేస్తుండగా.. కొన్ని విగ్రహాల్లో విత్తనాలను చేరుస్తున్నారు. తద్వారా నిమజ్జనం చేశాక మొక్కలు మొలిచి పర్యావరణానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
ఎన్నో రకాల ఉత్పత్తులు
గోమయంతో ధూప్‌స్టిక్స్, ధూప్ కప్‌లు, ప్రమిదలు, పిడకలు, హోమ సామగ్రి తయారుచేస్తున్నారు. ఇవేకాక తోరణాలు, కీ చైన్లు, ఫోన్ స్టాండ్లు కూడా తయారు చేస్తుండడం విశేషం. వీటితో పాటు పచ్చి గోమయాన్ని యంత్రాల ద్వారా ఆరబెట్టి సేంద్రియ ఎరువుగా రైతులు, ఇళ్లలో మొక్కల పెంపకందారులకు అందిస్తున్నారు. అలాగే, గోమూత్రంతో ఫినాయిల్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. విగ్రహాల తయారీలో గోమయంతోపాటు చెక్కపొట్టు, ముల్తానీ మట్టి వంటి సహజ పదార్థాలను వినియోగిస్తారు. ఈ మిశ్రమంలో చేసిన విగ్రహాలకు పగుళ్లు రాకుండా తొలుత 3 – 5 రోజులు నీడలో ఆరబెడతారు. ఆతర్వాత ఎండలో ఆరబెట్టి సహజ రంగులు అద్దుతున్నారు. గోశాల నిర్వాహకులు శ్రీనివాసచార్యులతో పాటు వారి కుటుంబసభ్యులు ఇందులో నిమగ్నమవుతున్నారు. వీరికి తోడు కొందరు మహిళలు ఖాళీ సమయాన పైకం ఆశించకుండా ఉచితంగా సేవ చేస్తున్నారు.
400కు పైగా గోవులకు ఆశ్రయం
సుమారు 18 ఏళ్ల క్రితం 4–5 గోవులతో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర గోశాల ప్రస్తుతం 400కు పైగా గోవులకు ఆశ్రయం ఇస్తోంది. ఈక్రమాన గోమయంతో తయారు చేసే ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణకు వెచ్చిస్తున్నారు. గోమయంతో తయారు చేసిన విగ్రహాలు సైజు ఆధారంగా రూ.150 నుంచి రూ.వెయ్యి వరకు అమ్మతున్నారు. ఓ వైపు పర్యావరణ పరిరక్షణలో భక్తులను భాగం చేయడమే కాక గోవుల సంరక్షణకు తోడ్పాటు అందేలా తక్కువ ధరకే విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
గోశాలలో విగ్రహాలు, ఇతర ఉత్పత్తుల తయారీ


