పరికరాల నిర్వహణ కాంట్రాక్టర్‌కు.. | - | Sakshi
Sakshi News home page

పరికరాల నిర్వహణ కాంట్రాక్టర్‌కు..

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

● పైలట్‌ ప్రాజెక్టు జాబితాలో జిల్లా ఆస్పత్రి ● ఏదైనా మరమ్మతుకు వస్తే వెంటనే సరిచేసే అవకాశం

● పైలట్‌ ప్రాజెక్టు జాబితాలో జిల్లా ఆస్పత్రి ● ఏదైనా మరమ్మతుకు వస్తే వెంటనే సరిచేసే అవకాశం

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో చికిత్సకు ఉపయోగించే ఏదైనా పరికరం మరమ్మతుకు వస్తే రోజులు, నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. సంబంధిత విభాగాల నిపుణులు వచ్చి పరిశీలించి చిన్న మరమ్మతులు అవసరమైతే స్థానికంగా లభించే విడిభాగాలతో పనిచేస్తున్నారు. అదే కీలకమైన పరికరాలు మొరాయించి, మరమ్మతులకు రూ.వేలు, రూ.లక్షలు కావాల్సివస్తే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించి అనుమతి వచ్చేసరికి రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యాన పరికరాల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. తద్వారా ఎలాంటి మరమ్మతులైనా వెంటనే పరీక్షించి తక్కువ సమయంలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడనుంది.

తొమ్మిది ఆస్పత్రుల్లో ఖమ్మం కూడా..

పలు ఆస్పత్రుల్లో బయో మెడికల్‌ పరికరాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌కు కేటాయించింది. తొలి దశగా మొత్తం తొమ్మిది ఆస్పత్రుల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అనుమతి ఇవ్వగా, హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి, నీలోఫర్‌ మహిళా శిశు ఆస్పత్రి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎమ్‌ఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ అండ్‌ రీజినల్‌ కేన్సర్‌ సెంటర్‌, కింగ్‌కోటి ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, ఆదిలాబాద్‌ రిమ్స్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌తో పాటు ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి కూడా ఇందులో ఉంది. ఆయా ఆస్పత్రుల్లో పరికరాల మరమ్మతులకు టీజీఎమ్‌ఎస్‌ఐడీసీ సాధారణ నిధుల నుంచి కేటాయించాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ప్రాజెక్టు అమల్లోకి రానుండగా, ఆస్పత్రుల్లోని పరికరాల వివరాలను పంపించాలని సూచించారు.

తప్పనున్న ఇబ్బందులు

ఖమ్మం జనరల్‌ ఆస్పత్రిలో ఏదైనా పరికరం మరమ్మతులకు గురైతే రోజుల తరబడి సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చే వారిలో కొందరు నిరీక్షించలేక ప్రైవేట్‌ డయాగ్నస్టిక్స్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పెద్దాస్పత్రిలో సిటీ స్కాన్‌, వెంటిలేటర్లు, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌, సీఆర్మ్‌ మిషన్లు, వార్మర్లు, ఫొటోథెరపీ, సీపాప్‌, ఆడియోమెట్రో వంటి పరికరాలు 200 వరకు ఉంటాయి. అలాగే ఎంఆర్‌ఐ త్వరలో అందుబాటులోకి రానుంది. వీటిని పర్యవేక్షణకు ఆస్పత్రిలో బయో మెడికల్‌ ఇంజనీర్‌ ఉన్నా, చిన్నపాటి మరమ్మతులకే జరుగుతున్నాయి. అవి కూడా ఒక్కోసారి వారం నుండి 10 రోజుల సమయం పడుతోంది. ప్రస్తుతం కాంట్రాక్టర్‌కు అప్పగించనుండడంతో ఏ యంత్రం పాడైనా సదరు కంపెనీ చూసుకుంటుందని సూపరింటెండెంట్‌ నరేందర్‌ తెలిపారు. త్వరలో మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్‌ పరిధిలోకి వెళ్లనుండగా, ఆపై వైద్య పరీక్షలు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement