శ్రీవారికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి ప్రత్యేక పూజలు

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణ లోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంమయూరిసెంటర్‌: సివిల్‌ సర్వీసెస్‌(ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ)కు సిద్ధమవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఫిరంగి తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ భాగస్వామ్యంతో హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్‌లో ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా 100 మందిని ఎంపిక చేయనుండగా ఇందులో ఎస్టీలు 75మంది, ఎస్సీలు 15 మంది, బీసీలు 10 మందికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే, గత ఐదేళ్లలో ప్రిలిమ్స్‌ అర్హత సాధించిన ఎస్టీ అభ్యర్థులను మరో 20మందిని కూడా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, కుటుంబ వార్షికాదాయం రూ.3లక్షల్లోపు ఉండి 21 – 32 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు కాగా, దివ్యాంగులకు సడలింపు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు https://welfare.sriramsias.com వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు.

కలెక్టరేట్‌లో

రేపటి ప్రజావాణి రద్దు

ఖమ్మం సహకారనగర్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 21వ తేదీన రద్దు చేసినట్లు కలెక్టర్‌ దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మండల, డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

రెండు రోజుల పాటు

హబ్‌లో పరీక్షలకు బ్రేక్‌

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఆవరణలోని తెలంగాణ డయోగ్నస్టిక్‌ హబ్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు సేవలు నిలిపివేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ నరేందర్‌ తెలిపారు. హబ్‌లోని సిబ్బంది ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నందున వైరస్‌ నిర్మూలనకు ఫ్యూమిగేషన్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతీనెల హానికరమైన సూక్ష్మజీవుల నిర్మూలనకు రసాయనాలతో ఫ్యూమిగేషన్‌ చేయాల్సి ఉన్నా, చాన్నాళ్లుగా జరగకపోవడంతో సిబ్బందికి కళ్లు, చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈమేరకు రెండు రోజుల పాటు సేవలు నిలిపివేసి ఫ్యూమిగేషన్‌ నిర్వహణకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పరీక్షలు నిలిపివేయగా, సోమవారం నుంచి సేవలు యథావిధిగా కొనసాగుతాయని సూపరింటెండెంట్‌ తెలిపారు.

బోధనపై ప్రత్యేక దృష్టి

వైరా: జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు బోధనపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి రవిబాబు సూచించారు. వైరా జూనియర్‌ కాలేజీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థుల హాజరును పరిశీలించాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. సిలబస్‌ ఆధారంగా పాఠాలు బోధిస్తూ పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని తెలిపారు. కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయాఇ్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం ఆయన కళాశాలలో మొక్క నాటారు. ప్రిన్సిపాల్‌ ఎల్‌.నవీన.జ్యోతి, ఏఓ శ్రీకాంత్‌, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

హజ్‌ యాత్రికులకు

వైద్యపరీక్షలు

ఖమ్మం వైద్యవిభాగం: హజ్‌ వెళ్తున్న యాత్రికులకు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఖమ్మం జనరల్‌ ఆస్పత్రిలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయగా 40 మంది యాత్రికులు హాజరయ్యారు. వీరికి ఈసీజీ, టూడీ ఎకో, రక్త పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement