వినీత్‌ది ముమ్మాటికీ హత్యే...
అన్ని కోణాల్లో విచారణ
● వినీత్ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు ● ఎలాంటి క్లూ దొరకక విచారణలో జాప్యం
సత్తుపల్లి: సత్తుపల్లిలోని పాత మిలీనియం స్కూల్ భవనం రెండో అంతస్తు నుంచి కింద పడిన బొడ్డు వినీత్(29) మృతి చెందగా, కారణాలు తెలియక మిస్టరీగానే మిగిలిపోయింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుమలూరు మండలం పోరంకి చెందిన సుబ్బారావు – సునీల దంపతుల కుమారుడు వినీత్ సత్తుపల్లిలోని ఓ మైక్రో సంస్థలో పనిచేసేవాడు. గతనెల 13న అర్ధరాత్రి ఆయన మృతి చెందగా, తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ముందడుగు పడకపోవడం గమనార్హం.
ఆ రాత్రి ఏం జరిగింది?
గతనెల 13న అర్ధరాత్రి ఒంటి గంట సమయాన మిత్రుడితో కలిసి వినీత్ పాత మిలీనియం స్కూల్ భవనం ఉన్న ప్రాంతానికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆతర్వాత రెండోసారి ఒక్కడే 1–40 గంటలకు ఫోన్ మాట్లాడుతూ రాగా.. మూడు నిమిషాల్లోనే భవనం పైనుంచి కింద పడ్డాడు. రెండో అంతస్తులో తలుపు తీసి ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లగా, అందులో ఉన్న వారు కేకలు వేయడంతో కంగారులో చూసుకోకుండా కిందకు దూకినట్లు తెలుస్తోంది. తలకు తీవ్రమైన గాయమైన ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు 108ను పిలిపించగా సిబ్బంది చేరుకుని అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఎందుకు వెళ్లాడు ?
అపార్ట్‌మెంట్‌కు వినీత్ ఎందుకు వెళ్లాడు, అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని తేల్చేందుకు పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. మెదటిసారి వినీత్‌తో కలిసి వెళ్లిన యువకుడిని విచారిస్తే బంధువులు ఉన్నారని చెప్పాడే తప్ప ఇతర వివరాలు తెలియదని బదులిచ్చినట్లు తెలిసింది. అలాగే, వినీత్ వెళ్లిన ఇంట్లోని దంపతులే కాక ఇంకొందరిని విచారించినా క్లూ లభించక.. వినీత్‌తో పాటు అపార్ట్‌మెంట్‌లోని అందరి కాల్ డేటా పరిశీలించినట్లు సమాచారం. వినీత్ లోపలకు వెళ్తున్న సమయాన ఏపీలో ఉండే కాబోయే భార్యతో ఫోన్‌లో మాట్లాడాడని నిర్ధారించుకున్నట్టు తెలిసింది. ఇంకొన్ని వివరాల సేకరణకు ఇంటర్నెట్ ప్రొటోకాల్ డెలివరీ రికార్డర్( ఐపీడీఆర్)కు మృతుడి ఫోన్‌ను పంపించారని, తద్వారా ఇంటర్నెట్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఫోన్ కాల్ మాట్లాడినా బయటపడే అవకాశముందని సమాచారం. అలాగే, శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపించారు.
బొడ్డు వినీత్‌ది ముమ్మాటికీ హత్యేనని ఆయన తల్లిదండ్రులు సుబ్బారావు, సునీల ఆరోపించారు. ఈమేరకు సత్తుపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యాన నిర్వహించగా వారితో పాటు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ కందికట్ల విజయ్ మాట్లాడారు. ఘటన జరిగి నెల దాటినా దోషులను పోలీసులు పట్టుకోలేదని, అనేక అనుమానాలు ఉన్నా విచారణలో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. నాయకులు కొలికపోగు వెంకటేశ్వరరావు, గొల్లమందల ముత్తారావు, అద్దేపల్లి సాగర్, సోర గుడి రాజేష్, గంధం పాండు, నందిగామ అఖిల్, అభిపాల్, అంబేద్కర్, మాణిక్యం పాల్గొన్నారు.
వినీత్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువులకు విచారణ వివరాలను ఇప్పటికే వివరించాం. ఎవరికై నా సందేహాలు ఉంటే నేరుగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. కేసుకు సంబంధించి ఐపీడీఆర్, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు రావాల్సి ఉంది.
– వసుంధర యాదవ్, ఏసీపీ, కల్లూరు


