ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో హార్వెస్ట్ విద్యాసంస్థలు ప్రారంభమై 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై క్లాస్ సాథీ చాంపియన్ షిప్ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కొరియా నుంచి క్లాస్ సాథీ సీఈఓ పంకజ్ అగర్వాల్‌తో పాటు ఖమ్మం ఎంపీ రామనహాయం రఘురాంరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరుకాగా, క్వెస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కె.నాగమణి, హార్వెస్ట్ గ్రూప్ విద్యాసంస్థల కరస్టాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యారంగ వ్యవస్థలో మేథస్సును అభివృద్ధి చేసుకునే అవసరం ఉందన్నారు. ఈ మేరకు తాము రూపొందించిన క్లాస్ సాథీ యాప్ ద్వారా పిల్లల్లో పాఠ్యాంశాలకు సంబంధించి క్విజ్ నిర్వహిస్తుండగా హార్వెస్ట్ విద్యాసంస్థల వారు నమర్ధవంతంగా ఉపయోగించుకొని 24,718 పాయింట్లు సాధించి దేశంలోనే మొదటి స్థానాన నిలిచారని తెలిపారు. ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్ దృష్ట్యా ఉన్నత విద్యావకాశాలను ఖమ్మంకు చేరువ చేసిన హార్వెన్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. కరస్పాండెంట్ రవిమారుత్ మాట్లాడుతూ పిల్లలు బాల్యాన్ని ఆనందంగా ఆస్వాదించేలా, వారిపై ఒత్తిడి లేకుండా బోధన అందిస్తున్నామని తెలిపారు. పాతికేళ్ల గతం గర్వంగా ఉండగా, మరింత బాధ్యతను గుర్తుచేస్తోందని చెప్పారు. ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకలు వచ్చే మూడు నెలల్లోనూ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా, వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘క్లాస్ సాథీ’ అవార్డుల ప్రదానం


