ఖమ్మంమయూరిసెంటర్: తెల్లవారుజామున 3–30 గంటలకే విధులకు హాజరై హైదరాబాద్ వెళ్లిన ఆర్టీసీ కండక్టర్ సామినేని లక్ష్మీనారాయణ(57) గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం డిపో కండక్టర్ ఎస్.ఎల్.నారాయణ శనివారం ఇల్లెందు – హైదరాబాద్ సర్వీస్‌కు కండక్టర్‌గా వెళ్లారు. తెల్లవారుజామునే బయలుదేరి హైదరాబాద్ వెళ్లగా, అక్కడ టిఫిన్ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలాడు. సిబ్బంది ఆయనను యశోద ఆస్పత్రికి, ఆతర్వాత తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బస్టాండ్‌లో సిబ్బంది ఆయనకు సీపీఆర్ చేసినా ప్రయోజనం దక్కలేదు. కాగా, లక్ష్మీనారాయణకు భార్య సుభద్ర, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
నవ్వుతూ పలకరించి..
ఖమ్మం డిపోలో శనివారం తెల్లవారుజామున విధులకు హాజరైన కండక్టర్ లక్ష్మీనారాయణ తోటి ఉద్యోగులను నవ్వుతూ పలకరించారు. హైదరాబాద్‌లో ఆయన మృతి చెందాడని తెలియడంతో ఉద్యోగులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా, పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పెద్ద కుమారుడి వివాహం కార్తీకమాసంలో చేయాలని సిద్ధమవుతుండగా ఈ ఘటన జరగడంతో విషాదం నెలకొంది. కాగా, ఎంజీబీఎస్‌లో లక్ష్మీనారాయణ గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలియగానే ఖమ్మం ఆర్‌ఎం సరిరామ్ స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడమే కాక ఆస్పత్రికి తీసుకెళ్లేలా సిబ్బందికి సూచనలు చేశారు. అయితే, ఫలితం దక్కక ఆయన మృతి చెందడంతో మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. ఖమ్మం నేతాజీనగర్‌లోని ఇంటికి లక్ష్మీనారాయణ మృతదేహాన్ని తీసుకురాగా భార్య సుభద్ర కన్నీరుమున్నీరయ్యారు. అక్కడ ఆర్‌ఎం సరిరామ్, డీఎం శివప్రసాద్, ఉద్యోగులు నివాళులర్పించారు.
ఎంజీబీఎస్‌లో గుండెపోటుతో
కుప్పకూలిన వైనం


