ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో విద్యను కాషాయీకరించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈక్రమాన చరిత్రను వక్రీకరిస్తూ, పసి మెదళ్లలో మతోన్మాదాన్ని నింపుతున్నారని తెలిపారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) జిల్లా 28వ మహాసభలు శనివారం ఐఎంఏ హాల్‌లో జరగగా, తొలుత పాత నెహ్రూనగర్ నుంచి పాత బస్టాండ్, మయూరిసెంటర్ మీదుగా హాల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సంఘ పతాకాన్ని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు రావి శివరామకృష్ణ ఆవిష్కరించగా లక్ష్మణ్ మాట్లాడుతూ బడ్జెట్‌లో విద్యకు నిధుల కేటాయింపు పూర్తిగా తగ్గిపోగా, కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ మాట మరవడమే కాక ప్రైవేట్‌లో ఫీజుల నియంత్రణను సైతం విస్మరించారని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చి వేలాది మందికి లబ్ధి చేకూరిస్తే గత కేసీఆర్, నేటి రేవంత్‌రెడ్డి సర్కార్ విద్యా రంగాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ నివేదిక సమర్పించగా, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, మడుపల్లి లక్ష్మణ్, బుర్ర మనోజ్, అమృత, బత్తినేని నీరజ, మామిళ్ల శ్రీనాథ్ రెడ్డి, చింతల రమేష్, అజిత్, తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా మహాసభలో
రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్


