ఖమ్మం సహకారనగర్: విద్యారంగంలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు మండలాల వారీగా ప్రణాళిక రూపొందించుకుని నెల వారీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.సదానందం సూచించారు. ఖమ్మంలోని సైన్స్ మ్యూజియంలో జిల్లా అకడమిక్ ప్యానల్ ఇన్‌స్పెక్షన్ బృందాల సమావేశాన్ని శనివారం అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పెసర ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలోడీఈఓ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఖమ్మం రెండో స్థానాన నిలిచినా ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు అవసరమైన సహకారం, శిక్షణ అందిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థాల పెంపునకు కృషి చేయాలని చెప్పారు. ప్రతీ టీం సభ్యుడు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎంఈఓ శైలజాలక్ష్మి, ఎఫ్‌ఎల్‌ఎన్ జిల్లా సెల్ కన్వీనర్ శ్యామ్యూల్, సభ్యులు ప్రవీణ్ కుమార్, శ్రవణ్‌కుమార్, సేవ్యా పాల్గొన్నారు.
కోర్టు కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఖమ్మం లీగల్: జిల్లా కోర్టులో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ముత్తయ్య, రవికుమార్, శ్రీనివాసులకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. అలాగే, హెడ్ కానిస్టేబుళ్లు చెన్నారావు, వెంకటేశ్వర్లుకు ఏఎస్సైలుగా పదోన్నతి రావడంతో శనివారం సన్మానించారు. ఎస్సై శ్రీకాంత్‌తో పాటు సీడీఓలు, లైజనింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


