వ్యవసాయ, గృహ రంగాలకు
గరిష్టంగా నమోదు
కోటాకు మించి అదనంగా వాడకం
ఇబ్బందులు లేకుండా సరఫరా
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. వర్షాభావ పరిస్థితులకు తోడు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. అటు వ్యవసాయం, ఇటు గృహావసరాలకు విద్యుత్ వినియోగం గరిష్టస్థాయిలో నమోదవుతోంది. ప్రస్తుతం ఖమ్మం విద్యుత్ సర్కిల్‌కు నిత్యం 5.15 మిలియన్ యూనిట్లు కేటాయిస్తుండగా, అంతకు మించి 6.82 మొదలు 7.35 మిలియన్ యూనిట్ల వరకు వినియోగం జరుగుతుండడం గమనార్హం. సెప్టెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు ఖమ్మం సర్కిల్ కోటా 87.55 మిలియన్ యూనిట్లకు 110.46 మిలియన్ యూనిట్లు.. అంటే 17రోజుల్లో అదనంగా 22.91 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు విద్యుత్ కోటా 85.68 మిలియన్ యూనిట్లకు 86.6 మిలియన్ యూనిట్లే వినియోగం జరగగా.. ఈసారి గణనీయంగా పెరిగింది.
బోర్లు, మోటార్ల ద్వారా..
జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఈసారి సాగు అవసరాలకు నీరు విడుదల చేయలేదు. అయితే, జిల్లాలో ఈ ఏడాది పంటల సాగు లక్ష్యం 5.50 లక్షల ఎకరాలకు గాను 4.50 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మరో 1.50 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్, మామిడి, మిరప వంటి ఉద్యాన పంటలను సాగవుతున్నాయి. సాగర్ నుంచి నీరు విడుదల కాకపోవడంతో స్థానికంగా ఉన్న జలాశయాలు, బోర్లు, బావుల నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా రైతులు పంటలకు అందిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయిలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
గృహాల్లో కూడా...
ప్రస్తుతం ఉష్ణోగ్రత వేసవిని తలపిస్తోంది. దాదాపు ప్రతీరోజు 34 – 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుండగా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, ఏసీల వినియోగం పెరిగింది. పగలు, రాత్రి తేడా లేకుండా వీటిని వాడుతుండడంతో జిల్లాలోని 4.95 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్ల ద్వారా వాడకం గణనీయంగా పెరిగింది.
నాలుగు డివిజన్లలో గరిష్టం
ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో సత్తుపల్లి, ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, మధిర డివిజన్లు ఉన్నాయి. వీటిలో సత్తుపల్లి, ఖమ్మం టౌన్, మధిర, ఖమ్మం రూరల్ డివిజన్లలో కోటాకు మించి విద్యుత్ వినియోగం నమోదవుతోంది. వైరా డివిజన్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా కోటా కన్నా తక్కువ విద్యుత్ వినియోగం జరిగింది. కాగా, ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు ఉదయం 6–30 నుంచి సాయంత్రం 5–30 గంటల వరకే సరఫరా ఇస్తుండగా. తరచూ అంతరాయాలు, అనధికారిక కోతలతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఎండలతో పాటే
పెరుగుతున్న వినియోగం
వర్షాభావం, ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది, వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగం గరిష్టస్థాయిలో నమోదవుతోంది. అయినా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇదే సమయాన వినియోగదారులు కూడా విద్యుత్ పొదుపు విధానాలు అలవర్చుకోవాలి.
– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ


