ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాను హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రహితంగా తీర్చిదిద్దేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన అవగాహన బైక్ ర్యాలీని ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల వద్ద ఆయన ప్రారంభించారు. పాత బస్టాండ్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లింక్ వర్కర్లు తదితరులు పాల్గొని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు అవగాహన, ఆరోగ్య అలవాట్లు కీలకమని తెలిపారు. యువతలో ఎయిడ్స్‌పై శాసీ్త్రయమైన అవగాహన పెంచడంతో పాటు బాధితుల పట్ల వివక్ష చూపకుండా సామాజిక మద్దతు అందేలా చైతన్యం కల్పించాలని సూచించారు. అనంతరం కళాకారులు ‘పల్లె సుద్దులు’ ద్వారా అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌ఓ రామారావు, అధికారులు వేణుమాధవ్, ఎల్.ప్రవీణ, ఎస్‌ఆర్ బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరుల్లా, అధ్యాపకులు డాక్టర్ బి.చెంచురత్నయ్య, డాక్టర్ ఎం.సునంద తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ దివాకర


