ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన ఈనెల 20వ తేదీన జిల్లాస్థాయి అండర్–14, 17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా క్రీడా సంఘం కార్యదర్శి వై.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు వివరాల కోసం టేబుల్ టెన్నిస్ కోచ్ వీవీఎస్.మూర్తి(98484 08335)ను సంప్రదించాలని సూచించారు.
మరో 2,632 మె.టన్నుల యూరియా
చింతకాని: మూడు జిల్లాల పరిధిలోని రైతుల అవసరాల నిమిత్తం చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు వివిధ కంపెనీల యూరియా చేరుతోంది. ఈక్రమాన శుక్రవారం ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 2,632.50 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయాదికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 832.50 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 1,200 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 500 మె.టన్నులు సరఫరా చేయగా మరో 100మె.టన్నుల బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.
21నుంచి
డీఈఐఈడీ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ) రెండో సంవత్సరం పరీక్షలు ఈ నెల 21నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ జి.సదానందం తెలిపారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలోని శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని ఆయన సూచించారు.
రామదాసు ధ్యానమందిరానికి 300 గజాల స్థలం
● నేలకొండపల్లి వాసుల రిజిస్ట్రేషన్
నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని రామదాసు ధ్యాన మందిరానికి సమీపంలో విలువైన స్థలాన్ని భక్తులు సమర్పించారు. నేలకొండపల్లి కి చెందిన రెండు కుటుంబాలు వారు మర్ల అన్నపూర్ణ, సాయిరాం, సాయికృష్ణ, ప్రమీలా దేవి, అనురాధ, స్వాతిశ్రీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి మందిరం ఎదురుగా 300 గజాల స్థలం ఉండడంతో రామదాసుపై భక్తితో మందిరం నిర్వహణకు ఉపయోగపడేలా అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయ ఉద్యోగి నిరంజన్‌కుమార్ సమక్షాన పత్రాలు అప్పగించగా వారిని సన్మానించారు. మందిరం పూజారి సౌమిత్రి రమేష్, విద్వత్ కళాపీఠం ప్రతినిధులు సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, నంచర్ల దేవీప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శనివారం కూడా
అపరాల కొనుగోళ్లు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ప్రతీ శనివారం సెలవు ఉన్నా అపరాల క్రయవిక్రయాలు చేపట్టనున్నట్లు మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గడిచిన కొద్ది నెలలుగా అన్ సీజన్ కావటంతో వారానికి ఐదు రోజులే అపరాల కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం సీజన్ కావడంతో చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యుల వినతితో ఇకపై శనివారం కూడా పెసలు, కందులు, మినుములు వంటి అపరాల కొనుగోళ్లు చేపడుతామని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కార్యదర్శి ఓ ప్రకటనలో సూచించారు.


