● తదుపరి ఆదేశాలిచ్చే వరకు యథాతఽథ స్థితి ● కేఎంసీ కమిషనర్‌కు కోర్టు సూచన
ఖమ్మంమయూరిసెంటర్: ఇళ్లను తొలగించాలనే నోటీసులు జారీ కావడంతో ఆందోళనకు గురవుతున్న ఖమ్మంలోని శ్రీనివాసనగర్ టింబర్ డిపోల ప్రాంత వాసులకు ఊరట లభించింది. కొద్దిరోజులుగా ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో నిరసన తెలుపుతున్న విషయం విదితమే. కోర్టు ఆదేశాలతో కేఎంసీ అధికారుల నుంచి జారీ అయిన నోటీసులను అందుకున్న వారు తాజాగా బీఆర్‌ఎస్, సీపీఎం పార్టీల మద్దతుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈమేరకు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం వర్చువల్‌గా విచారణకు హాజరుకాగా యథాతఽథ స్థితి కొనసాగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు..
శ్రీనివాసనగర్‌లో 80 అడుగుల రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లను తొలగించాలని స్థల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈమేరకు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఇళ్లు నిర్మించుకున్న వారికి అధికారులు నోటీసుల జారీ మొదలుపెట్టారు. ఈ అంశంపై శుక్రవారం విచారణ ఉండగా.. బాధితుల తరఫున మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు సీపీఎం నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ఆదేశాలపై విచారణ చేపట్టడమే కాక ప్రస్తుత పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారించింది. తెలిసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యథాతథస్థితి అమలుచేయాలని న్యాయస్థానం ఆదేశించినట్లు చెబుతున్నారు. అంతేకాక బాధితులకు న్యాయం జరిగేలా కలెక్టర్ సమన్వయంతో ప్రణాళిక అమలుచేయాలని కేఎంసీ కమిషనర్‌కు న్యాయస్థానం సూచించిందని వెల్లడించారు. ఈ విషయమై కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ శ్రీనివాసనగర్‌లో ఇళ్లకు నోటీసులు ఇవ్వడం ఆపాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామని పేర్కొన్నారు.
న్యాయస్థానం ఆదేశాలపై హర్షం..
శ్రీనివాసనగర్‌లో ఇళ్లకు నోటీసులు ఇవ్వకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. ఇక సీపీఎం జిల్లా, డివిజన్ కార్యదర్శులు నున్నా నాగేశ్వర్రావు, వై.విక్రమ్ మాట్లాడుతూ పార్టీ తరఫున రిట్ పిటీషన్ దాఖలు చేయడంతో 15రోజుల పాటు బలవంతంగా ఇళ్లను తొలగించే చర్యలను చేపట్టవద్దని ఆదేశించిందని తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం బాధితులు మాజీ కార్పొరేటర్ దొడ్డా నగేష్ ఆధ్వర్యాన కలెక్టర్ దివాకరను కలిసి తమను రోడ్డున పడేయొద్దని కోరారు.


