విచారణ చేయిస్తున్నాం..
● వాయిదాల సొమ్మును పక్కదారి పట్టిస్తున్న కొందరు ● ఐకేపీ అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం ● నిలువునా మోసపోతున్న పేద మహిళలు
ఖమ్మంమయూరిసెంటర్: కూలి పనులు చేసుకుంటూ, పొదుపు సూత్రం పాటిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుందామనుకున్న పేద మహిళల కష్టార్జితానికి రక్షణ కరువైంది. ప్రభుత్వాలు అందించే రుణాలు ఆసరాగా చిన్నపాటి వ్యాపారాలు, ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులను కొందరు నిలువునా ముంచుతున్నారు. క్షేత్రస్థాయిలో ఐకేపీ, సీ్త్రనిధి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు గ్రూపు అధ్యక్షులు, గ్రామ సమాఖ్యల బాధ్యులు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక మహిళలు ప్రతీనెలా కష్టపడి చెల్లిస్తున్న వాయిదా డబ్బును బ్యాంకుల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకుంటున్నారు. తీరా ఏళ్లు గడిచాక చూస్తే బకాయిలు అలాగే ఉంటుండడంతో మహిళలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో వెలుగుచూస్తున్న ఈ దోపిడీ సంఘాల నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతోంది.
బ్యాంకుల్లో వేయకుండానే..
కూసుమంచి మండలం జక్కేపల్లిలో వెలుగుచూసిన ఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అక్కడ ఓ స్వయం సహాయక సంఘానికి బ్యాంకు లింకేజీ ద్వారా అందిన రూ.14 లక్షల రుణాన్ని 10 మంది సభ్యులు పంచుకున్నారు. ప్రతినెలా రూ.3,600 చొప్పున కిస్తీలను సభ్యులు క్రమం తప్పకుండా గ్రూపు అధ్యక్షురాలికి చెల్లిస్తూ వచ్చారు. అయితే ఆమె సభ్యుల నమ్మకమే ఆసరాగా వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. అనుమానం రాకుండా నెలకు ఒకరిద్దరి ఖాతాల్లో జమ చేస్తూ రసీదులు ఇవ్వడంతో అంతా నమ్మారు. రెండేళ్ల తర్వాత అసలు విషయం బయటపడి బ్యాంకు అధికారులను సంప్రదించగా ఏకంగా రూ.4.13 లక్షలు పక్కదారి పట్టినట్లు తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
సీ్త్రనిధి రుణాల్లోనూ..
కల్లూరు మండలం ముగ్గువెంకటాపురంలోనూ సీ్త్రనిధి రుణాల వ్యవహారంలో గోల్‌మాల్ బయటపడింది. గ్రామ సమాఖ్య పరిధిలోని వివిధ గ్రూపుల్లో ఏకంగా రూ.43 లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితమే అప్పు మొత్తాన్ని అసలు, వడ్డీతో సహా చెల్లించినా రికార్డుల్లో ఇంకా బకాయి ఉన్నట్లే చూపిస్తున్నారు. మూడేళ్ల క్రితమే బాకీ మొత్తం చెల్లించి మృతి చెందిన సభ్యురాలి పేరిట నేటికీ రూ.1.89 లక్షల అప్పు ఉండడం గమనార్హం. రేణుక గ్రూప్ సభ్యులు 2021లోనే రుణం చెల్లించినా, రికార్డుల్లో రూ.4.96 లక్షల బకాయి చూపిస్తుండటంతో ఆగ్రహించిన మహిళలు ఇటీవల సీ్త్రశక్తి భవన్ ఎదుట నిరసన తెలపడంతో విచారణ చేపడుతామని అధికారులు సెలవిచ్చారు.
క్షేత్ర స్థాయిలోనే..
అక్రమాలకు కొందరు ఐకేపీ సిబ్బంది, గ్రామ సమాఖ్య బాధ్యుల పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తోంది. ప్రతీనెల వీఓ సమావేశాలు నిర్వహించి రికార్డులు, బ్యాంక్ పాస్‌బుక్కులను ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పని సరిగ్గా జరగక అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం లేదా పోలీసులను ఆశ్రయించే వరకు అధికారుల దృష్టికి ఈ విషయాలు రాకపోవడం విస్తుగొలుపుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా పొదుపు సంఘాల ఖాతాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలకు బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ వస్తోంది.
కూసుమంచి మండలం జక్కేపల్లి, కల్లూరు మండలంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తున్నాం. మహిళా సభ్యుల నగదును పక్కదారి పట్టించిన వారి నుంచి రికవరీ చేస్తాం. సభ్యుల ఖాతాల్లో నగదు జమ చేయకుండా వాడుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం.
– కొండపల్లి శ్రీరామ్, డీఆర్‌డీఓ


