● నేడు జిల్లావ్యాప్తంగా నాటేలా కార్యాచరణ ● 1,88,284 విద్యార్థులతో కార్యక్రమం
నేలకొండపల్లి: పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థితో ఒక మొక్క నాటించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. వనమహోత్సవంలో భాగంగా ‘అమ్మ పేరిట మొక్క(ఏక్ పేడ్.. మాకే నామ్)’ పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో శనివారం నాటించనుండగా.. పంచాయతీ నర్సరీల నుంచి పాఠశాలలకు మొక్కలు చేర్చడంపై డీఆర్‌డీఏ అధికారులు దృష్టి సారించారు. ఈ విషయమై డీఆర్‌డీఏ కొండపల్లి శ్రీరామ్ మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు తమ పాఠశాలలో మొక్క నాటడమే కాక ఆ సమయాన తల్లితో దిగిన ఫొటోను అప్‌లోడ్ చేయించాలని సూచించారు. జిల్లాలోని 1,552 పాఠశాలల్లో 1,88,284 మంది విద్యార్థులు ఉండగా.. ఇంతే సంఖ్యలో మొక్కలను శనివారం నాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
విజయవంతం చేయాలి
వన మహోత్సవంపై శనివారం నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హమీ పధకం క్షేత్ర సహాయకులతో ఎంపీడీఓ ఎం.ఎర్రయ్య సమావేశమయ్యారు. ‘అమ్మ కోసం మొక్క’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
మొక్కల పంపిణీ
బోనకల్: బోనకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎకో క్లబ్ ఆధ్వర్యాన ‘ఏక్ పేడ్.. మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు జ్యోతి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలని, తద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడవచ్చని తెలిపారు. ఉపసర్పంచ్ బానోతు కొండ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం గోపి, ఉపాధ్యాయులు మంజూష, వెంకటలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ త్రివేణితో పాటు అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


