రూ.30వేలు చెల్లిస్తే సర్టిఫికెట్‌! | - | Sakshi
Sakshi News home page

రూ.30వేలు చెల్లిస్తే సర్టిఫికెట్‌!

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

● ‘సదరమ్‌’ శిబిరాల్లో అక్రమాలు ● విచారణ చేపట్టిన ట్రెయినీ కలెక్టర్‌

● ‘సదరమ్‌’ శిబిరాల్లో అక్రమాలు ● విచారణ చేపట్టిన ట్రెయినీ కలెక్టర్‌

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్‌ ఆస్పత్రిలోని నిర్వహించే సదరమ్‌ శిబిరాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తామని కొందరు డబ్బు దండుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించగా.. అక్రమార్కులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇదే సమయాన ఎలాగైనా సర్టిఫికెట్‌ పొందాలనే ఆతృతతో కొందరు దివ్యాంగులు అర్హత లేకున్నా దళారులను ఆశ్రయిస్తుండగా వారు సర్టిఫికెట్‌కు రూ.30 వేలకు పైగా డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. వీరికి కొందరు ఆస్పత్రి బాధ్యుల సహకారం కూడా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

కలెక్టర్‌కు ఫిర్యాదుతో...

సదరమ్‌ శిబిరాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల కొందరు కలెక్టర్‌ దివాకరకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు ట్రెయినీ కలెక్టర్‌ పరాస్‌ కుమార్‌ శుక్రవారం పెద్దాస్పత్రిలోని సదరమ్‌ విభాగంలో విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రిజిస్టర్లు తనిఖీ చేయడమే కాక వైకల్య పరీక్షలు నిర్వహించే వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. ప్రధానంగా ఇటీవల జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి అర్హత ప్రకారం ఇచ్చారా, లేదా అని విచారించారు. కాగా, అదనపు కలెక్టర్‌ శ్రీజ సదరమ్‌ విభాగాన్ని గత ఏడాది బలోపేతం చేశారు. విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడమే కాక క్యాంప్‌లకు వచ్చే దివ్యాంగులకు అర్హత ఆధారంగా యుడీఐడీ కార్డులు జారీ చేయించారు. అక్రమాలు జరగకుండా కఠినంగా వ్యవహరించినా మళ్లీ ఇటీవల అక్రమార్కులు కొత్త దారులు వెతుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యాన క్యాంపులపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement