డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకుల భూకబ్జాలను సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పక్కా ఆధారాలతో బయటపెట్టారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరితో కలిసి మాట్లాడారు. గత 15 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై బీఆర్‌ఎస్ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారన్నారు. కానీ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబీకుల పేరిట ఉన్న భూముల వివరాలను రేవంత్‌రెడ్డి బయటపడడంతో వారికి నోట మాట రావడం లేదని చెప్పారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, గజ్జెల్లి వెంకన్న, చోటా బాబా, కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ పాల్గొన్నారు.
పేదల ఇళ్లపై స్పష్టమైన వైఖరి
పేదల ప్రయోజనాల దృష్ట్యా వారి ఇళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ఏ ఒక్క ఇంటిని అనవసరంగా తొలగించడానికి వీల్లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్‌కు తెలియచేశారని పేర్కొన్నారు. అంతేకాక న్యాయ సాయం అందించేందుకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. ఈమేరకు శ్రీనివాసనగర్ వాసులు వదంతులను నమ్మకుండా సంయమనం పాటించాలని కోరారు.


