వేసవిని తలపిస్తున్న ఉష్ణోగ్రత
● పగటి పూట 35 డిగ్రీలకు చేరువగా నమోదు ● ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
ఖమ్మంవ్యవసాయం: ఎల్‌నినో తన ప్రతాపాన్ని చాటుతోంది. వాతావరణ శాఖ నుంచే హెచ్చరించిన విధంగానే వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. రోజురోజుకు జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. చల్లని గాలులు వీయాల్సిన ప్రస్తుత సమయాన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సమీపానికి చేరింది. అంతేకాక హ్యుమిడిటీ(గాలిలో తేమ) 60 – 100 శాతం వరకు నమోదవడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పంటలపై తీవ్ర ప్రభావం
ఉష్ణోగ్రతల ప్రభావం సాగులో ఉన్న పంటలపై పడుతోంది. పలు ప్రాంతాల్లో సాగులో ఉన్న వరి, మిర్చి, పత్తి పంటలు వడబడుతున్నాయి. తేమ ఎక్కువగా ఉండడంతో పురుగు, తెగుళ్లు కూడా వ్యాపిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మిర్చిలో రసం పీల్చే పురుగులు, వరిలో కాండం తొలుచు పురుగు ఉధృతి పెరుగుతందని. నీటి ఎద్దడి ఉన్నచోట పత్తి పూత దశలోనే ఎండిపోయే స్థితికి చేరింది.
కోటాకు మించి విద్యుత్ వినియోగం
ఉష్ణోగ్రతల నేపథ్యాన జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. సంస్థ కేటాయించిన కోటాకు మించి జిల్లాలో విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు గంణాకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాకు రోజుకు 5.15 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేటాయించగా, 6.82 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. ప్రధానంగా వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఉక్కపోతతో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడం.. పంటలకు నీరందించేందుకు వ్యవసాయ విద్యుత్ మోటార్లు నడిపిస్తుండడంతో సబ్‌స్టేషన్లపై లోడ్ పడుతోంది. దీంతో అక్కడక్కడ లో ఓల్టేజీ సమస్య తలెత్తుతోంది.
మరో మూడు రోజులు ఇలాగే..
వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో 2, 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. పగటి ఉష్ణోగ్రత 34–35 డిగ్రీలు, రాత్రి 26–27 డిగ్రీలుగా ఉండే అవకాశముంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు, ఉరుములతో కూడిన వర్షం కురిసినా ఎండ మాత్రం కొనసాగే అవకాశముందని సమాచారం. అంతేకాక తేమ శాతం 66 – 83 శాతం వరకు ఉండడంతో ఉక్కపోత తప్పదని చెబుతున్నారు.


