ఖమ్మం లీగల్: కమిషనర్ న్యాయవాదులుగా కొనసాగేవారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నాగరాజు సూచించారు. న్యాయవాది పరిషత్ ఆధ్వర్యాన ఖమ్మంలో గురువారం ‘అడ్వకేట్ కమిషనర్స్ వర్క్’పై న్యాయవాదులకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ భూతగాదా కేసుల్లో న్యాయవాద కమిషనర్ వర్క్ కీలకమని తెలిపారు. న్యాయవాదుల్లో నైపుణ్యాలు పెంచడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి డాక్టర్ జీ.వీ.మహేష్‌నాధ్ కమిషనర్ వర్క్ బాధ్యతలు, విధులను వివిధ కేసుల ఆధారంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యడ్లపల్లి రమేష్, న్యాయవాది పరిషత్ బాధ్యులు సత్యప్రసాద్, వెంకటేశ్వరగుప్తా, విజయ్‌కుమార్, శేఖర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతులతో విద్యుత్ సరఫరా బలోపేతం
ఖమ్మంవ్యవసాయం: మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ముందస్తు ప్రణాళికతో మౌలిక వసతుల బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. సర్కిల్ పరిధిలో కొత్తగా నాలుగు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, మూడు అదనపు పవర్ ట్రాన్‌ఫార్మర్లు, 613 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంతేకాక 4.059 కి.మీ. మేర 33 కేవీ విద్యుత్ లైన్లు, 158.4 కి.మీ. నిడివితో 11 కేవీ లైన్లు ఏర్పాటు చేయగా, లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి ఎనిమిది 600 కేవీఆర్ కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణపై తమ ఉద్యోగుఉల దృష్టి సారించగా, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటుచేశామని తెలిపారు. ఇదే సమయాన వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా జరిగేలా అత్యవసర స్పందనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్‌ఈ ఓ ప్రకటనలో వివరించారు.
‘పీఎం మెంటార్‌షిప్’లో ఖమ్మం విద్యార్థి
ఖమ్మం సహకారనగర్: జాతీయ స్థాయిలో యువ, విద్యార్థి రచయితలను ప్రోత్సహించేలా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మెంటార్ షిప్ – 2.0లో ఖమ్మం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ విద్యార్థి ప్రతిభ చాటాడు. రెండేళ్ల క్రితం మెంటార్‌షిప్‌నకు ఎంపికై న డిగ్రీ విద్యార్థి మాదాసు ఉదయ్‌కిరణ్ ‘ప్రజాస్వామ్యం, సంస్థలు’ అంశంపై పరిశోధనాత్మక అధ్యయన నివేదిక సమర్పించగా నెలకు రూ.50వేల చొప్పున ఆరు నెలలకు రూ.3లక్షల గౌరవ భృతి అందుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా గురువారం అభినందించి మాట్లాడారు. తమ విద్యార్థి పరిశోధన సారాంశాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిందని తెలిపారు. విశ్రాంత తెలుగు అధ్యాపకుడు డాక్టర్ సీతారాం ఉదయ్‌ను ప్రోత్సహించగా, ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు డాక్టర్ రవివర్దన్, డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ ఎం.పిచ్చయ్య, డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.


